Konda Surekha: ఇందిరమ్మ చీరలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కొండా సురేఖ

Konda Surekha Attends Telangana Summit in Indiramma Saree
  • ఇందిరమ్మ చీరలో వచ్చి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచిన మంత్రి
  • మహిళా మంత్రులు ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని సీఎం చెప్పారన్న మంత్రి
  • గోబెల్ సమ్మిట్ అంటూ బీఆర్ఎస్ చేసిన విమర్శలపై ఆగ్రహం
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీరలో విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించిన ఇందిరమ్మ చీరను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో నాణ్యత లేని చీరలను పంపిణీ చేసిందని ఆరోపించారు. వాటిని మహిళలు ధరించడానికి వీలులేని విధంగా ఉన్నాయని అన్నారు.

తమ ప్రభుత్వం నాణ్యతతో కూడిన చీరలను అందించిందని, అందుకే మంత్రులు, మంత్రుల భార్యలు ఇందిరమ్మ చీరలు ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని తాను గ్లోబల్ సమ్మిట్‌కు ఈ చీరను ధరించి వచ్చానని అన్నారు. తమది ఇందిరమ్మ పాలన అని కొండా సురేఖ స్పష్టం చేశారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను గోబెల్ సమ్మిట్ అంటూ విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం చేస్తుంటే జీర్ణించుకోలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సదస్సు ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, ఈ పెట్టుబడులను రేవంత్ రెడ్డి ఇంట్లోనే, మంత్రుల ఇళ్లలోనో దాచుకోబోమని అన్నారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
Konda Surekha
Telangana Rising Global Summit
Indiramma Sarees
Revanth Reddy
Telangana Government

More Telugu News