ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు... నిబంధనలు పాటించని ఏ సంస్థను ఉపేక్షించేది లేదు: మంత్రి రామ్మోహన్ నాయుడు

  • ఇండిగో వైఫల్యాలపై కేంద్రం కఠిన వైఖరి
  • ప్రణాళికా లోపాలను ఉపేక్షించేది లేదన్న మంత్రి రామ్మోహన్ నాయుడు
  • ఇప్పటికే ప్రయాణికులకు రూ.750 కోట్లకు పైగా రిఫండ్
  • రోజువారీ సర్వీసుల్లో 5 శాతం కోత విధించిన డీజీసీఏ
  • మంత్రి ప్రకటన తర్వాత సభ నుంచి విపక్షాల వాకౌట్
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అయితే ప్రణాళికా లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగించిన తీవ్ర ఇబ్బందులకు సంస్థను బాధ్యుల్ని చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ, నిబంధనలు పాటించని ఏ ఎయిర్‌లైన్స్ సంస్థను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఈ సంక్షోభం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇండిగో తన రోజువారీ సర్వీసుల్లో 5 శాతం కోత విధించాలని డీజీసీఏ ఆదేశించింది. షెడ్యూళ్లను సమర్థంగా నిర్వహించడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇప్పటికే ప్రయాణికులకు రూ.750 కోట్లకు పైగా రిఫండ్ చేసినట్లు ఇండిగో తెలిపిందని రామ్మోహన్ నాయుడు సభకు వివరించారు. ఈ నెల‌ 5 నుంచి 15 వరకు రద్దయిన విమానాల రిఫండ్లు, బ్యాగేజీ సమస్యలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రయాణికులను ఆదుకోవడానికి విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధించిందని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రీబుకింగ్‌లు చేశారని తెలిపారు. పైలట్లు, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్ప‌ష్టం చేశారు.

మంత్రి ప్రకటన అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దేశంలో పటిష్ఠ‌మైన, ప్రయాణికులే ప్రథమ ప్రాధాన్యతగా ఉండే విమానయాన రంగాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.


More Telugu News