దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ పేరుతో 55 అంతస్తుల టవర్.. ప్రత్యేకతలివే!

  • దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ పేరుతో 'షారుఖ్జ్' కమర్షియల్ టవర్
  • 55 అంతస్తుల టవర్‌ను నిర్మించిన‌ డ్యాన్యూబ్ ప్రాపర్టీస్
  • ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న బాలీవుడ్ బాద్‌షా
  • యూనిట్ ప్రారంభ ధర రూ. 4.2 కోట్లుగా వెల్లడి
  • 40కి పైగా అత్యాధునిక లగ్జరీ సదుపాయాల కల్పన
దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో బాలీవుడ్ తళుకులు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డ్యాన్యూబ్ ప్రాపర్టీస్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పేరుతో 'షారుఖ్జ్ బై డ్యాన్యూబ్' అనే భారీ ప్రీమియం కమర్షియల్ టవర్‌ను నిర్మించింది. మంగళవారం ఎక్స్‌పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, డ్యాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రిజ్వాన్ సాజన్ పాల్గొననున్నారు.

షేక్ జాయెద్ రోడ్డులో 55 అంతస్తులతో నిర్మించిన‌ ఈ టవర్‌ను దుబాయ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార స‌ముదాయాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ తమ సంస్థకు, నటుడు షారుఖ్ ఖాన్‌కు 33 ఏళ్ల వృత్తిపరమైన ప్రస్థానానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని డ్యాన్యూబ్ అభివర్ణించింది. ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వ్య‌క్తులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టును రూపొందించారు.

ఈ సందర్భంగా రిజ్వాన్ సాజన్ మాట్లాడుతూ, దుబాయ్ అభివృద్ధి రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను మరింత పెంచుతుందని అన్నారు. గురుగ్రామ్, ముంబై వంటి మార్కెట్లతో పోలిస్తే దుబాయ్‌లో ప్రాపర్టీ ధరలు ఇప్పటికీ పోటీగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉందని వివరించారు.

'షారుఖ్జ్ బై డ్యాన్యూబ్'  ప్రత్యేకతలివే..!
పది లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ టవర్‌లో యూనిట్ ప్రారంభ ధర రూ. 4.2 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో స్కై పూల్, ఎయిర్ ట్యాక్సీల కోసం హెలిప్యాడ్, వ్యాలెట్ సర్వీసులు, ప్రత్యేక బిజినెస్ లాంజ్‌లు సహా 40కి పైగా అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 


More Telugu News