Gurukula hostel: గురుకుల హాస్టల్ లో విషాదం.. సాంబారు పాత్రలో పడి బాలుడి దుర్మరణం

Tragedy at Gurukula Hostel Child Dies After Falling into Sambar Pot
  • తెల్లారితే పుట్టిన రోజు.. ఇంతలోనే ప్రమాదం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత
  • పెద్దపల్లి జిల్లా మల్లాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఘటన
నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ వేడి సాంబారు పాత్రలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తెల్లారితే బాబు పుట్టిన రోజు వేడుక జరుపుకోవాల్సిన తరుణంలో కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..
 
మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన మొగిలి మధుకర్‌ మల్లాపూర్ గురుకుల హాస్టల్ లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హాస్టల్ లోని సిబ్బంది కోసం కేటాయించిన క్వార్టర్స్ లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం హాస్టల్ లో విద్యార్థుల కోసం మధుకర్ సాంబారు సిద్ధం చేశాడు. మిగతా వంటకాలు సిద్ధం చేస్తుండగా మధుకర్ కొడుకు మోక్షిత్ (4) అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ మోక్షిత్ సాంబారు పాత్రలో పడిపోయాడు. సాంబార్ వేడిగా ఉండడంతో మోక్షిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మోక్షిత్ ను కరీంనగర్‌ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

సోమవారం మోక్షిత్ బర్త్ డే కావడంతో ఆదివారం సాయంత్రం ధర్మారం వెళ్లాలని మధుకర్ భావించాడు. వంట పనులు త్వరగా పూర్తిచేసుకుని కొడుకు పుట్టిన రోజు కోసం కొత్త దుస్తులు, కేకు, ఇతర సామాగ్రి తీసుకురావాలని అనుకున్నాడు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పుట్టిన రోజున ఆనందోత్సాహాలతో గడపాల్సిన ఇంటికి బాలుడు విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Gurukula hostel
Peddapalli district
Sambhar accident
Child death
Telangana news
Kotapalli
Dharmaram
Hostel tragedy
Mokshith

More Telugu News