ప్రపంచవ్యాప్తంగా 'మిషన్ ఇంపాసిబుల్ : ద ఫైనల్ రెకనింగ్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వేల కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, అంతే స్థాయిలో లాభాలను సాధించింది. టామ్ క్రూజ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి క్రిస్టో ఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మే 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆగస్టు 19 నుంచి రెంటల్ విధానంలో 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కి వచ్చింది. డిసెంబర్ 4 నుంచి సబ్ స్క్రైబర్లందరికీ తెలుగు .. తమిళ్ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

కథ: అమెరికా అధ్యక్షురాలు ఎరికా (ఏంజెలా బాసెట్) ఏజెంట్ ఈథన్ హంట్ ( టామ్ క్రూజ్)కి పంపించిన ఒక వాయిస్ మెసేజ్ తో ఈ కథ మొదలవుతుంది. 'ఎంటీటీ' అత్యంత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదుగుతుంది.  9 దేశాల న్యూ క్లియర్ పవర్స్ ను అది తన కంట్రోల్ లోకి తీసుకుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ తరువాత అది ఒక శక్తిమంతమైన దేశంపై తన బలాన్ని ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తూ ఉంటుంది. ముందుగా తమ దేశమే టార్గెట్ అవుతుందని అమెరికా రక్షణ వ్యవస్థ ఆందోళన చెందుతూ ఉంటుంది. 

న్యూక్లియర్ పవర్స్ కలిగిన 9 దేశాలను 'ఎంటిటీ' నియంత్రణలోకి తీసుకునేలోగా, దానిని నాశనం చేయాలి. లేదంటే తాము అణుబాంబును లాంచ్ చేయవలసి ఉంటుందనే ఆలోచనకి అమెరికా రక్షణ వ్యవస్థ వస్తుంది. ఈ విషయంలో  ఏజెంట్ ఈథన్ ను తమకి సహకరించవలసిందిగా కోరుతుంది. ఆయన దగ్గర ఉన్న ఒక సీక్రెట్ 'కీ'ని తమకి అప్పగించమని కోరుతుంది. ఆ 'కీ'తోనే తాను ఈ సమస్యను పరిష్కరిస్తాననీ, అందుకు 72 గంటల గడువు ఇవ్వమని ఈథన్ కోరతాడు. 

శత్రువుల దాడికి గురైన సేవాస్ట్ పోల్ జలాంతర్గామి సముద్రగర్భంలోనే ఉండిపోతుంది. అందులో 'పాడ్కోవ' అనే ఒక ఎంటీటీ ఒరిజినల్ సోర్స్ కోడ్ పరికరం ఉంటుంది. దానిని లూథర్ తయారు చేసిన డిజిటల్ పాయిజన్ పిల్ కి కనెక్ట్ చేసి సైబర్ స్పేస్ లో అప్ లోడ్ చేస్తే, ఎంటీటీ అధీనంలోని న్యూక్లియర్ పవర్స్ నిర్వీర్యమైపోతాయి అని ఏజెంట్ ఈథన్ చెబుతాడు. గడువు దాటితే వెంటనే తమ యాక్షన్ మొదలవుతుందని అమెరికా అధ్యక్షురాలు హెచ్చరిస్తుంది. తాను అనుకున్నది సాధించడం కోసం ఈథన్ ఏం చేస్తాడు? ఎలాంటి అవాంతరాలను అధిగమిస్తాడు? అనేది మిగతా కథ.

విశ్లేషణ: ఇది 'మిషన్ ఇంపాసిబుల్' సిరీస్ నుంచి వచ్చే చివరి సినిమా అనే ప్రచారం జరగడంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రావడం ఆనందాన్ని కలిగించే విషయంగా మారింది. ఈ సిరీస్ నుంచి ఒక సినిమా వస్తుందనగానే ఒక రేంజ్ లో యాక్షన్ పాళ్లను ఆశిస్తారు. అయితే ఈ సారి యాక్షన్ కంటే డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం కనిపిస్తుంది.
 
ప్రపంచదేశాలు అణు విధ్వంసానికి గురికాకుండా చూడవలసిన బాధ్యత కథానాయకుడిపై పడుతుంది. అందుకోసం అతను తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు .. ప్రాణాలకు తెగించి చేసే విన్యాసాలే ఈ కథలో ప్రధానమైన పాత్రను పోషించేది. అయితే మొదటి 50 నిమిషాలలో ఆడియన్స్ ఆశించే స్థాయిలో కథ పరుగులు పెట్టదు. సముద్రంపై హీరో అడుగుపెట్టడం దగ్గర నుంచే కథ కాస్త వేగాన్ని పుంజుకుంటుంది. అప్పటివరకూ సంభాషణలతో సాగదీసినట్టుగా అనిపిస్తుంది. 

హీరో వీరోచితమైన విన్యాసాలకు సంబంధించిన రెండు సన్నివేశాలు ఈ సినిమా స్థాయికి తగినట్టుగా అనిపిస్తాయి. సముద్ర గర్భంలోని జలాంతర్గామిలోకి ప్రవేశించి తనకి కావలసిన పరికరాన్ని సాధించే సన్నివేశం .. తనకి కావలసిన ఒక వస్తువు కోసం విలన్ ను బుల్లి విమానంలో  వెంటాడుతూ గాల్లో చేసే విన్యాసాలు ఆడియన్స్ ను విస్మయులను చేస్తాయి. ఈ రెండు యాక్షన్ సీన్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చు అనే స్థాయిలో ఉంటాయి. 

పనితీరు: న్యూక్లియర్ పవర్ .. డిజిటల్ వైరస్ .. సీక్రెట్ 'కీ' అంటూ దర్శకుడు ఈ కథపై ఆడియన్స్ కి ఆసక్తిని రేకెత్తించాడు. ఒక మహా విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ఒక టైమ్ లిమిట్ ను సెట్ చేసి ఆడియన్స్ లో ఉత్కంఠను పెంచుతూ వెళ్లాడు. మొదటి 50 నిమిషాల నిడివిలో కొంత భాగాన్ని తగ్గిస్తే మరిన్ని మార్కులు కొట్టేసేదేమో అనిపిస్తుంది. 

టామ్ క్రూజ్ మొదలు మిగతా నటీనటులంతా కూడా చాలా గొప్పగా చేశారు. సముద్రంపైన .. సముద్ర గర్భంలోని సన్నివేశాలు .. విమాన విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించిన విధానం గొప్పగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా ప్రధానమైన పాత్రను పోషించిందని చెప్పాలి. 

ముగింపు
: యాక్షన్ .. ఎమోషన్స్ తో కూడిన సినిమా ఇది. విజువల్ పరంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే మొదటి 50 నిమిషాల కథను కాస్త నిదానంగా నడిపించడం అసంతృప్తిని  కలిగిస్తుంది .. నిడివి పెరిగినట్టుగా అనిపిస్తుంది. అక్కడి వరకూ ఓపిక పడితే ఆ తరువాత కథ అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ప్రత్యేకమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.