Saudi Arabia: మద్యం అమ్మకాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా!

Saudi Arabia Eases Alcohol Restrictions for Non Muslim Expats
  • సౌదీ అరేబియాలో మద్యం అమ్మకాలపై నిబంధనల సడలింపు
  • అధిక జీతాలున్న ముస్లిమేతర విదేశీయులకు మద్యం కొనుగోలుకు అనుమతి
  • నెలకు 50 వేల రియాళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీతం తప్పనిసరి
సౌదీ అరేబియా ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నివసిస్తున్న ముస్లిమేతర విదేశీయులకు మద్యం కొనుగోలు చేసేందుకు మరిన్ని సడలింపులు ఇచ్చింది. నెలకు 50,000 రియాళ్లు (సుమారు 13,300 డాలర్లు) లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉన్నవారు ఇప్పుడు మద్యం కొనుగోలు చేయవచ్చు.

ఈ నిబంధన ప్రకారం, అర్హులైన విదేశీయులు తమ జీతం వివరాలను ధ్రువీకరించే సర్టిఫికెట్‌ను చూపించి, రాజధాని రియాద్‌లో ఉన్న ఏకైక మద్యం విక్రయ కేంద్రంలోకి ప్రవేశం పొందాల్సి ఉంటుంది. గత ఏడాది విదేశీ దౌత్యవేత్తల కోసం ప్రారంభమైన ఈ స్టోర్‌లోకి, ఇప్పుడు 'ప్రీమియం రెసిడెన్సీ' హోదా కలిగిన ముస్లిమేతరులకు కూడా ప్రవేశం కల్పించారు. నెలవారీ పాయింట్ల ఆధారిత కోటా పద్ధతిలో ఇక్కడ అమ్మకాలు జరుగుతాయి.

విదేశీ నిపుణులను, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సౌదీ ప్రభుత్వం ఈ సామాజిక సంస్కరణలను చేపడుతోంది. రియాద్‌ను అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగానే ఈ సడలింపులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా సౌదీలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం, సినిమా థియేటర్లు, వినోద కార్యక్రమాలకు అనుమతివ్వడం వంటి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. రియాద్‌తో పాటు దేశంలోని మరో రెండు నగరాల్లో కూడా కొత్త మద్యం దుకాణాలను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
Saudi Arabia
Saudi Arabia alcohol
Saudi Arabia liquor
Riyadh
Saudi Arabia reforms
Saudi Arabia expats
Saudi Arabia foreign workers
Saudi Arabia economy
Saudi Arabia business

More Telugu News