Woman Constable: తుపాకితో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై భర్త సోదరుడి లైంగికదాడి

Woman Constable Sexually Assaulted by Brother in Law in Uttar Pradesh
  • అదనపు కట్నం కోసం మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు
  • బలవంతంగా శానిటైజర్ తాగించిన భర్త, కుటుంబ సభ్యులు
  • భర్త సహా ఏడుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భర్తే ఓ మహిళా కానిస్టేబుల్ పాలిట కాలయముడయ్యాడు. అదనపు కట్నం కింద ఎస్‌యూవీ కారు తీసుకురాలేదన్న కారణంతో భర్త, అతడి కుటుంబ సభ్యులు ఏడుగురు కలిసి ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. ఈ క్రమంలో బలవంతంగా శానిటైజర్ తాగించి, లైంగికంగా వేధించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పిలిభిత్‌లో పనిచేస్తున్న 27 ఏళ్ల మహిళా కానిస్టేబుల్‌కు, గౌతమ్ బుద్ధ నగర్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌తో 2023 జనవరి 26న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బాధితురాలి తండ్రి రూ. 50 లక్షలు ఖర్చు చేసి కారు, నగలతో పాటు ఇతర బహుమతులు ఇచ్చారు. అయినా అత్తింటివారు ఎస్‌యూవీ కారు కోసం వేధించడం మొదలుపెట్టారు.

ఈ వేధింపులు శ్రుతిమించడంతో బాధితురాలు ఆదివారం రాత్రి బిసల్‌పూర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తమామలు, ఇద్దరు బావలు, వారి భార్యలపై కేసు నమోదు చేయాలని కోరింది. పోలీసులు నిందితులపై వరకట్న వేధింపులు, దాడి సహా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఫిర్యాదులో బాధితురాలు పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన భర్త అన్న (బావ) అక్టోబర్ 5న తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడని, ఈ ఘటనపై ఇప్పటికే మీరట్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పేర్కొంది. సెప్టెంబర్ 5న తన భర్త, వదినతో అసభ్యకర స్థితిలో ఉండగా చూశానని, దీంతో ఆగ్రహించిన వారు తనతో బలవంతంగా శానిటైజర్ తాగించారని తెలిపింది.

గర్భవతిగా ఉన్నప్పుడు మగబిడ్డ పుట్టాలని కొన్ని మందులు వాడాలని తనపై భర్త, మామ ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో దాడి చేశారని వాపోయింది. ఆ దాడి కారణంగా గర్భంలో ఉన్న బిడ్డకు గాయాలై, పుట్టిన తర్వాత మూర్ఛ వ్యాధి బారిన పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. బిడ్డ భవిష్యత్తు కోసం ఇన్నాళ్లూ మౌనంగా భరించానని, చివరకు భర్త విడాకులిస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు వివరించింది.
Woman Constable
Uttar Pradesh
Dowry Harassment
Sexual Assault
Police Complaint
SUV Car
Domestic Violence
Pilibhit
गौतम बुद्ध नगर
Meerut

More Telugu News