Rajinikanth: 'పడయప్ప 2'పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటన.. ఫ్యాన్స్‌కు పండగే!

Rajinikanth Announces Padayappa 2 Sequel Plans
  • 'నరసింహ' సీక్వెల్‌పై చర్చలు జరుగుతున్నాయన్న రజనీకాంత్
  • 'నీలాంబరి - పడయప్ప 2' అనే టైటిల్ పరిశీలనలో ఉందని వెల్లడి
  • తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం చెప్పిన సూపర్ స్టార్
  • సినిమాకు నిర్మాత, కథ, టైటిల్ కూడా తానేనని చెప్పిన రజనీ
సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పారు. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'పడయప్ప' (తెలుగులో 'నరసింహ') చిత్రానికి సీక్వెల్ రాబోతోందని సంకేతమిచ్చారు. ఈ సీక్వెల్ కోసం కథా చర్చలు జరుగుతున్నాయని, అంతా అనుకున్నట్లు జరిగితే అభిమానులకు మరోసారి పండగలాంటి సినిమా అందిస్తానని స్పష్టం చేశారు.

డిసెంబర్ 12న తన 75వ పుట్టినరోజు సందర్భంగా 'పడయప్ప' సినిమాను రీ-రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ది రిటర్న్ ఆఫ్ పడయప్ప' పేరుతో విడుదల చేసిన ఓ వీడియోలో రజనీ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "ఇటీవల '2.0', 'జైలర్ 2' వంటి సీక్వెల్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు 'పడయప్ప'కు రెండో భాగం ఎందుకు చేయకూడదని అనిపించింది" అని ఆయన తెలిపారు.

"తొలి భాగంలో నీలాంబరి (రమ్యకృష్ణ) వచ్చే జన్మలోనైనా పగ తీర్చుకుంటానని చెబుతుంది. అందుకే 'నీలాంబరి - పడయప్ప 2' అనే టైటిల్‌తో కథపై చర్చిస్తున్నాం. సినిమా బాగా వస్తే, అభిమానులకు మరో పండగే" అని ఆయన వివరించారు. ఈ చిత్రానికి అసలు నిర్మాతను, కథ అందించింది కూడా తానేనని రజనీ ఈ వీడియోలో వెల్లడించారు.

'పడయప్ప' అనే టైటిల్ కూడా తనే సూచించానని రజనీకాంత్ తెలిపారు. "నేను ఆ టైటిల్ చెప్పగానే దర్శకుడు కేఎస్ రవికుమార్ ఆశ్చర్యపోయారు. ఈ పదం పాతగా అనిపిస్తోందని అన్నారు. కానీ, ఆ టైటిల్‌లో ఒక వైబ్రేషన్ ఉందని చెప్పి ఒప్పించాను" అని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ ప్రకటనతో 'నరసింహ' సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Rajinikanth
Padayappa 2
Narasimha 2
KS Ravikumar
Ramya Krishnan
Nilambari
Tamil Cinema
Telugu Dubbed Movie
Sequel Announcement
Superstar Rajinikanth

More Telugu News