Pinky Sharma: కృష్ణుడి విగ్రహాన్నే పెళ్లాడిన యువతి.. యూపీలో బంధువుల సందడితో వింత వివాహం

Pinky Sharma Marries Krishna Idol in Uttar Pradesh Wedding
  • బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వేడుక
  • చిన్నప్పటి నుంచి కృష్ణుడిపై భక్తితోనే ఈ నిర్ణయమని వెల్లడి
  • గోవర్ధన పరిక్రమలో జరిగిన ఓ సంఘటనతో స్థిర నిశ్చయం తీసుకుందన్న తండ్రి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జరిగిన ఓ వింత వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇస్లాంనగర్‌కు చెందిన పింకీ శర్మ (28) అనే యువతి, తాను ఆరాధించే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

పింకీ శర్మ నివాసం వద్ద సుందరమైన కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లికొడుకులా అలంకరించారు. మేళతాళాలతో ఊరేగింపుగా (బారాత్) విగ్రహాన్ని మండపానికి తీసుకొచ్చారు. పింకీ తల్లిదండ్రులు విగ్రహానికి సాదరంగా స్వాగతం పలికిన అనంతరం, ఆమె కృష్ణుడి మెడలో పూలమాల వేసి, తన మెడలోనూ మాల ధరించారు. నుదుట సింధూరం దిద్దుకుని, విగ్రహాన్ని చేతిలో పట్టుకుని సప్తపది నడిచారు. వివాహానంతరం విందు భోజనాలు ఏర్పాటు చేయగా, కళాకారులు భజనలు, నృత్యాలతో అలరించారు. అప్పగింతల కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే, పింకీ తన తల్లిదండ్రుల వద్దే నివసిస్తున్నారు.

ఈ వివాహం గురించి పింకీ తండ్రి సురేశ్ చంద్ర మాట్లాడుతూ.. "నా కుమార్తెకు చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే ఎంతో భక్తి. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో బృందావనంలో గోవర్ధన పరిక్రమ పూర్తిచేసింది. ఆ సమయంలో స్వామి ప్రసాదంలో ఓ బంగారు ఉంగరం ఆమె పైటలో పడింది. దాన్ని కృష్ణుడి ఆశీర్వాదంగా భావించి, తన జీవితాన్ని ఆయనకే అంకితం చేయాలని నిర్ణయించుకుంది. మొదట మేము ససేమిరా అంగీకరించలేదు, కానీ ఆమె అచంచల భక్తిని చూసి ఇది దైవ సంకల్పంగా భావించి అంగీకరించాం" అని వివరించారు. ప్రస్తుతం ఈ పెళ్లి వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. 
Pinky Sharma
Krishna Idol Wedding
Uttar Pradesh
Hindu Wedding
Hindu traditions
Religious Wedding
Lord Krishna
Badaun district
spiritual marriage
arranged marriage

More Telugu News