Indian Households Gold: భారతీయుల ఇళ్లలో 34,600 టన్నుల బంగారం!

Indian Households Hold 34600 Tonnes of Gold
  • ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.342 లక్షల కోట్లు
  • పెట్టుబడిగా బంగారానికి పెరుగుతున్న ఆసక్తి
  • ఆభరణాల కన్నా ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్‌లే మేలని సూచన
  • గతేడాది 60 శాతానికి పైగా లాభాలు పంచిన పసిడి
ధరలు ఆకాశాన్నంటుతున్నా భారతీయులకు బంగారంపై మోజు ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలోని కుటుంబాల వద్ద ఉన్న పసిడి నిల్వలపై ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబాల దగ్గర ఏకంగా 34,600 టన్నుల బంగారం ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. నగలు, కడ్డీలు, నాణేల రూపంలో ఉన్న ఈ పసిడి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.342 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇది మన దేశ జీడీపీలో 88.8 శాతానికి సమానం కావడం గమనార్హం.

గతంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం ఆభరణాల రూపంలోనే పసిడిని కొనుగోలు చేసేవారు. కానీ, గడిచిన ఏడాది కాలంలో బంగారం 60 శాతానికి పైగా లాభాలు అందించడంతో చాలామంది దీనిని ఒక పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లు, మల్టీ అసెట్ ఫండ్స్ వంటి పథకాలతో ముందుకొస్తున్నాయి.

అయితే, పెట్టుబడి ఉద్దేశంతో బంగారం కొనాలనుకునే వారు ఆభరణాలకు దూరంగా ఉండడమే మంచిదని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఒక నివేదికలో సూచించింది. నగల తయారీలో 30 నుంచి 35 శాతం వరకు రాళ్లు, రత్నాల విలువే ఉంటుందని, దీనికి అదనంగా తరుగు, తయారీ ఛార్జీలు కూడా చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ఖర్చులన్నీ పోయి లాభం రావాలంటే పసిడి ధర ఏటా కనీసం 30 శాతం పెరగాల్సి ఉంటుంది. కాబట్టి, కేవలం పెట్టుబడి ద్వారా లాభాలు ఆర్జించాలనుకునే వారు భౌతిక బంగారం (ఫిజికల్ గోల్డ్) లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
Indian Households Gold
Gold Holdings India
Morgan Stanley Report
India GDP
Gold Investment
Gold ETFs
Physical Gold
Kotak Institutional Investor

More Telugu News