Telangana Weather: తెలంగాణలో చంపేస్తున్న చలి!

Telangana Shivers as Cold Wave Intensifies
  • రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
  • హైదరాబాద్‌లోనూ భారీగా పడిపోయిన టెంపరేచర్లు
  • చలిమంట కాచుకుంటూ నిప్పంటుకుని వృద్ధురాలు మృతి
  • మరో రెండు రోజులు చలిగాలులు తప్పవన్న వాతావరణ శాఖ
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణను చలిపులి వణికిస్తుండటంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని 17 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉండటం గమనార్హం.

మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 8.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది.

హైదరాబాద్ నగరాన్ని సైతం చలి వదలడం లేదు. నగర శివారు ప్రాంతమైన శేరిలింగంపల్లిలో ఆదివారం రాత్రి 8.4 డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదిలా ఉండగా, జగిత్యాల జిల్లాలో చలి కారణంగా ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మల్యాల మండలం తాటిపల్లిలో తొంట మల్లవ్వ (85) అనే వృద్ధురాలు చలిమంట కాచుకుంటుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతి చెందింది.

రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Weather
Telangana Cold Wave
Hyderabad Weather
Sangareddy Temperature
Winter in Telangana
Coldest Temperature
Weather Report Telangana
Old Woman Death
Low Temperatures Telangana

More Telugu News