జాతీయ సగటును మించిన ఏపీ జీఎస్‌డీపీ... గణాంకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

  • సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
  • 2025-26 తొలి అర్ధ సంవత్సరంలో 10.91 శాతం జీఎస్‌డీపీ వృద్ధి నమోదు
  • పారిశ్రామిక రంగంలో 12.05 శాతం, సేవల రంగంలో 11 శాతం వృద్ధి
  • గత ఐదేళ్లలో రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల జీఎస్‌డీపీ నష్టపోయిందన్న సీఎం
  • తలసరి ఆదాయం జాతీయ సగటును దాటి రూ.2.66 లక్షలకు చేరింది
  • ఈ ఆర్థిక సంవత్సరానికి 17.11 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యమని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు 10.91 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి జాతీయ సగటు 8.8 శాతంతో పోలిస్తే ఇది గణనీయంగా అధికం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రంగాల వారీగా ఆర్థిక ప్రగతి వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక రంగం తిరిగి గాడిలో పడిందని, అన్ని రంగాల్లోనూ సానుకూల వృద్ధి కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

రంగాల వారీగా ప్రగతి ఇలా...!
2025-26 రెండో త్రైమాసికం నాటికి వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో బలమైన వృద్ధి నమోదైనట్లు సీఎం వివరించారు. ఈ త్రైమాసికంలో వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.1,25,571 కోట్లుగా ఉండగా, పారిశ్రామిక రంగం జీవీఏ రూ.86,456 కోట్లు, సేవల రంగం జీవీఏ రూ.1,60,075 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం 2.78 శాతం నుంచి ఏకంగా 12.20 శాతానికి ఎగబాకి జాతీయ సగటును అధిగమించడం విశేషం.

వ్యవసాయ రంగంలో 11.43 శాతం వృద్ధిరేటు సాధించగా, అందులో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో రికార్డు స్థాయిలో 26.27 శాతం వృద్ధి కనిపించింది. వరి దిగుబడి గతంతో పోలిస్తే 23.95 శాతం పెరిగి 3.64 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అరటి దిగుబడిలో అనూహ్యంగా 151.2 శాతం వృద్ధితో 37.31 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. మత్స్య, రొయ్యల దిగుబడి కూడా వరుసగా 17.30, 27.09 శాతం పెరిగింది.
పారిశ్రామిక రంగంలో మైనింగ్ 18.43 శాతం, తయారీ రంగం 11.66 శాతం, నిర్మాణ రంగం 11.81 శాతం వృద్ధిని నమోదు చేశాయి. విద్యుత్ ఉత్పత్తి 19.12 శాతం పెరిగి 26,837 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. సేవల రంగంలో రియల్ ఎస్టేట్ 14.31 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆతిథ్య రంగం 8.50 శాతం, రవాణా రంగం 5.99 శాతం వృద్ధిని సాధించాయి. ఈ త్రైమాసికంలోనే జల రవాణా ద్వారా 52.50 మిలియన్ టన్నుల కార్గో రవాణా జరగగా, 14.98 లక్షల మంది విమాన ప్రయాణాలు చేశారు.

గత ఐదేళ్ల పాలనతో పోలిక
ఈ సందర్భంగా 2014-19 మధ్య టీడీపీ పాలన, 2019-24 మధ్య గత ప్రభుత్వ పాలనలో నమోదైన వృద్ధిరేటును చంద్రబాబు పోల్చిచూపారు. 2014-19 మధ్య జీఎస్‌డీపీ వృద్ధి 13.49 శాతంగా ఉంటే, 2019-24 మధ్య అది 10.32 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రం సుమారు రూ.7 లక్షల కోట్ల జీఎస్‌డీపీని నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే వృద్ధి కొనసాగి ఉంటే రాష్ట్రానికి అదనంగా రూ.76,195 కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని విశ్లేషించారు.

తలసరి ఆదాయంలో కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించిందని, 2018-19లో రూ.1,54,031గా ఉన్న తలసరి ఆదాయం 2023-24 నాటికి రూ.2,37,951కి మాత్రమే పెరిగిందని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే దానిని రూ.2,66,240కి పెంచగలిగామని తెలిపారు. ఇది ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం రూ.2,05,324 కంటే ఎక్కువని గుర్తుచేశారు.
భవిష్యత్ లక్ష్యాలు.. స్వర్ణాంధ్ర-2047
ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలోనే రూ.7,58,270 కోట్ల జీఎస్‌డీపీ సాధించామని, వార్షిక లక్ష్యంలో ఇది 41 శాతమని చంద్రబాబు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రూ.18,65,704 కోట్ల జీఎస్‌డీపీతో 17.11 శాతం వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. 

2014-19 మధ్య సాధించిన 13.49 శాతం వృద్ధిరేటును కొనసాగించగలిగితే స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.292 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం రూ.49 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సుస్థిర ప్రగతితో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు.


More Telugu News