హైదరాబాదులో ఘోరం... ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు

  • హైదరాబాద్ వారాసిగూడలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
  • తల్లి కళ్లెదుటే పవిత్ర గొంతు కోసిన మేనమామ వరసయ్యే యువకుడు 
  • ఘటనాస్థలిలో కత్తి, మొబైల్ వదిలి పరారైన నిందితుడు
  • కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిని ఆమె తల్లి కళ్లెదుటే గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో ఈ దారుణం జరిగింది. మృతురాలిని పవిత్రగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పవిత్రకు ఉమాశంకర్‌ వరుసకు మేనమామ అవుతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. అయితే, ఉమాశంకర్ మద్యానికి బానిస అనే కారణంతో ఆమె అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ క్రమంలో ఉమాశంకర్... పవిత్రపై కోపం పెంచుకున్నాడు. పవిత్రతో మాట్లాడుతూనే, అకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

కూతురిని కాపాడుకునేందుకు తల్లి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హత్య చేసిన వెంటనే నిందితుడు ఉమాశంకర్, తన కత్తిని, మొబైల్ ఫోన్‌ను ఘటనాస్థలంలోనే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు, క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. "హత్యకు గల కచ్చితమైన కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం" అని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


More Telugu News