పేరు పలకడంపై తృణమూల్ ఎంపీ సూచన.. సానుకూలంగా స్పందించిన మోదీ

  • వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటర్జీ పేరును 'బంకిం దా' అని పలికిన మోదీ
  • బంకిం బాబు అని సంబోధించాలని తృణమూల్ ఎంపీ సూచన
  • పొరపాటును సరిచేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటర్జీ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబోధించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ సూచనకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. వందేమాతరంపై చర్చ సందర్భంగా పార్లమెంటులో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

బంకిం చంద్ర ఛటర్జీని ప్రధాని మోదీ పలుమార్లు బంకిం దా (దాదా) అని సంబోధించారు. దీంతో ఎంపీ సౌగత్ రాయ్ 'దా' అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదరుడు అని సంబోధించేందుకు బెంగాలీ భాషలో 'దా' అని ఉపయోగిస్తుంటారని, కానీ బంకిం చంద్ర వంటి సాంస్కృతిక దిగ్గజానికి అటువంటి పదం సరికాదని విజ్ఞప్తి చేశారు. బంకిం బాబు అని సంబోధించాలని కూడా సూచించారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సూచన పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఇక నుంచి బంకిం బాబు అనే సంబోధిస్తానని స్పష్టం చేశారు. తన పొరపాటును సరిచేసినందుకు సౌగత్ రాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో, నేను మిమ్మల్ని దాదా అని సంబోధించవచ్చా? దీనికేమీ అభ్యంతరం చెప్పరు కదా! అని సరదాగా అన్నారు.


More Telugu News