50 పైసలు, రూ.1, రూ.2 నాణేలు చెల్లుబాటు అవుతాయి: ఆర్బీఐ వీడియో

  • నాణేలపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసిన ఆర్బీఐ
  • వాట్సాప్ ద్వారా వ్యక్తిగత సందేశాలు పంపిస్తున్న ఆర్బీఐ
  • 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు అన్నీ చెల్లుబాటు 
50 పైసల నాణేంతో సహా వివిధ విలువలు కలిగిన నాణేలు, నోట్లు చలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. నకిలీ నోట్ల గుర్తింపు, కరెన్సీకి సంబంధించిన అపోహల గురించి ప్రజలకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగా, నాణేలపై ప్రజల నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా వ్యక్తిగత సందేశాలు పంపుతోంది. నాణేలపై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను రూపొందించింది.

ఈ వీడియో ప్రకారం, ఒక కొనుగోలుదారు రూ.10 నాణేన్ని తీసుకువస్తే, దుకాణదారు అది చెల్లదని చెబుతాడు. అయితే ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయని కొనుగోలుదారుడు దుకాణదారుకు సమాధానమిస్తాడు. చివరగా, అన్నీ నాణేలు చెల్లుబాటు అవుతాయని రూ.10 నాణేంతో మాట్లాడిస్తున్నట్లుగా ఈ వీడియో ఉంటుంది.

నాణేలు వేర్వేరు డిజైన్‌లతో ఉన్నప్పటికీ అవన్నీ చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది. 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు అన్నీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది. నాణేల గురించి తప్పుదోవ పట్టించే సమాచారం లేదా వదంతులను నమ్మవద్దని సూచించింది. వ్యాపారులు కూడా సంకోచించకుండా ప్రజల నుంచి నాణేలను స్వీకరించాలని ఆర్బీఐ విజ్ఞప్తి చేసింది.


More Telugu News