Amit Pasi: వచ్చాడు.. సెంచరీ బాదాడు!... వరల్డ్ రికార్డు సమం చేసిన బరోడా క్రికెటర్

Amit Pasi Scores Century on T20 Debut Equals World Record
  • టీ20 అరంగేట్రంలోనే సెంచరీ బాదిన బరోడా కీపర్ అమిత్ పాసి
  • ప్రపంచ రికార్డును సమం చేసిన 26 ఏళ్ల యువ ఆటగాడు
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్వీసెస్‌పై బరోడా విజయం
  • ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా గుర్తింపు
బరోడా వికెట్ కీపర్-బ్యాటర్ అమిత్ పాసి సంచలనం సృష్టించాడు. తాను ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగి ప్రపంచ రికార్డును సమం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సోమవారం సర్వీసెస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఈ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

ఈ మ్యాచ్‌లో 26 ఏళ్ల అమిత్ పాసి కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సుల సహాయంతో 114 పరుగులు సాధించాడు. కేవలం 44 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో, టీ20 అరంగేట్రంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన పాకిస్థాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ (114) రికార్డును సమం చేశాడు. పంజాబ్ ఆటగాడు శివమ్ భాంబ్రీ, హైదరాబాద్ ఆటగాడు అక్షత్ రెడ్డి తర్వాత కెరీర్ తొలి టీ20 మ్యాచ్ లోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా పాసి నిలిచాడు.

వికెట్ కీపర్ జితేష్ శర్మ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియాకు సెలెక్ట్ కావడంతో, అతని స్థానంలో బరోడా జట్టులోకి వచ్చిన పాసి ఓపెనర్‌గా బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. శివాలిక్ శర్మతో మూడో వికెట్‌కు 60 పరుగులు, కెప్టెన్ విష్ణు సోలంకితో కలిసి కేవలం 32 బంతుల్లోనే 75 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో సర్వీసెస్ జట్టు 207 పరుగులకే పరిమితమవడంతో బరోడా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Amit Pasi
Baroda cricketer
Syed Mushtaq Ali Trophy
T20 debut century
Bilal Asif record
Indian T20 batsman
Jitesh Sharma
Baroda vs Services
cricket record
T20 cricket

More Telugu News