Rammohan Naidu: ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థలోని అంతర్గత సమస్యలే కారణం: రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu Says IndiGo Crisis Due to Internal Issues
  • రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై రగడ
  • సిబ్బంది రోస్టరింగ్, ప్రణాళికలో వైఫల్యమే సమస్యకు మూలమన్న రామ్మోహన్
  • టికెట్ ధరలు పెంచకుండా పరిమితులు విధించినట్లు వెల్లడి
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది పూర్తిగా ఇండిగో సంస్థ అంతర్గత సమస్యల వల్లే తలెత్తిందని, ప్రభుత్వ నిబంధనల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

"ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో ఉన్న లోపాలే. కొత్తగా తెచ్చిన విమాన సిబ్బంది పనివేళల పరిమితి నిబంధనలతో ఎలాంటి సంబంధం లేదు" అని రామ్మోహన్ నాయుడు వివరించారు. అందరితో చర్చించిన తర్వాతే ఈ నిబంధనలు రూపొందించామని, డిసెంబర్ 3 వరకు సర్వీసులు సజావుగానే నడిచాయని గుర్తుచేశారు.

ఈ సంక్షోభం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర అసౌకర్యానికి చింతిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో, విమాన టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచకుండా ప్రభుత్వం పరిమితులు విధించిందని, ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సభకు హామీ ఇచ్చారు.

అయితే, మంత్రి రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానంతో విపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి.

Rammohan Naidu
IndiGo
IndiGo crisis
Indian Aviation
Aviation crisis
Flight cancellations
Flight delays
Civil Aviation Ministry
Pawan Kalyan
Airline industry

More Telugu News