KA Paul: రేవంత్ రెడ్డిని కలిసి అప్పుల నుంచి బయటపడే సూచన చేశా, కానీ: గ్లోబల్ సమ్మిట్‌పై కే.ఏ. పాల్ తీవ్ర విమర్శలు

KA Paul Criticizes Revanth Reddy on Debt Management and Global Summit
  • ఆధారాలతో సహా మరో 17 కేసులు తెలంగాణ ప్రభుత్వంపై వేస్తానన్న పాల్
  • రేవంత్ రెడ్డి రెండేళ్ల కాలంలో వరస్ట్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
  • దోచుకునే వారే గ్లోబల్ సదస్సుకు వస్తున్నారని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి రాష్ట్రం అప్పుల నుంచి బయటపడే మార్గాలను సూచించానని, అయితే ఆయన తన సూచనలను విస్మరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హిల్ట్ పథకంపై తాను న్యాయస్థానంలో కేసు వేశానని, త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తానని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి ఈ రెండేళ్ల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని పాల్ విమర్శించారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, ఇటీవల హిల్ట్ పథకం పేరిట 9,300 ఎకరాలను అమ్మేసి రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు ఇష్టానుసారంగా అబద్ధపు వాగ్దానాలు చేశారని, ఇప్పుడు డబ్బులు లేవని చెబుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం క్షీణించిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మంత్రులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. తెలంగాణ నుంచి డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డిని ఉత్తమ ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దాలని తాను భావించానని, కానీ ఆయన రెండేళ్లలో అత్యంత చెత్త ముఖ్యమంత్రిగా మారారని పాల్ అన్నారు. గ్లోబల్ సదస్సు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దోచుకునే వారంతా ఈ సదస్సుకు వస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సోదరుడిని ఇన్‌ఛార్జ్‌గా నియమించి రూ.400 కోట్లతో సదస్సు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

ఈ సదస్సుకు 200 దేశాల నుంచి ఒక్క అధ్యక్షుడైనా వస్తున్నారా, ఎవరైనా ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ సదస్సులో కేవలం కమీషన్ల కోసమే భూముల ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డిలో మార్పు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని కేఏ పాల్ హెచ్చరించారు.
KA Paul
Revanth Reddy
Telangana
Global Summit
Praja Shanti Party
Telangana Government

More Telugu News