నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

  • అలాంటి వాళ్లను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలన్న డీకే
  • రూ.500 కోట్లు ఇస్తే పంజాబ్ సీఎం పోస్టు దక్కుతుందన్న సిద్ధూ భార్య
  • అంత డబ్బు ఇవ్వలేకనే సిద్ధూ సీఎం కాలేదని వెల్లడి
పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉందని, రూ.500 కోట్లు చెల్లిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఐదారుగురు సీనియర్ నేతలు ఆ పదవిని ఆశిస్తున్నారని చెబుతూ సిద్ధూను వారు ఎదగనివ్వడం లేదని ఆరోపించారు. రూ.500 కోట్లు ఇచ్చే స్థోమత తమకు లేకపోవడంతో సిద్ధూకు సీఎం సీటు దక్కలేదని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలు అటు పంజాబ్ తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ సంచలనంగా మారాయి.

నవజ్యోత్ కౌర్ చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. పంజాబ్ సీఎం పోస్టుకే 500 కోట్లు ఉంటే కర్ణాటక సీఎం పోస్టుకు ఎంత చెల్లించాలో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవజ్యోత్ కౌర్ ఆరోపణలు, బీజేపీ నేతల విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సీఎం పోస్టుకు కోట్లు చెల్లించాలన్న వ్యాఖ్యలను ఖండిస్తూ.. అలాంటి ఆరోపణలు చేసిన వారిని వెంటనే మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని అన్నారు. ఓ మంచి పిచ్చాసుపత్రి చూసి వారిని అందులో చేర్పించాలని, మంచి వైద్యం అందేలా చూడాలని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.


More Telugu News