German citizenship: తొమ్మిదేళ్లుగా జర్మనీలో ఉంటున్నా భారతీయతను వదులుకోలేకపోతున్నా.. ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్

NRI Mayukh Panja on Why He is Not Giving Up Indian Citizenship
  • జర్మనీ సిటిజన్ షిప్ పొందేందుకు అర్హత వచ్చినా దరఖాస్తు చేయలేదన్న భారత పౌరుడు
  • తన దృష్టిలో పాస్‌ పోర్ట్ కేవలం ఒక డాక్యుమెంట్ కాదని వెల్లడి
  • ఇండియన్ సిటిజన్ షిప్ వదులుకోవడం ఇష్టంలేదని వ్యాఖ్య
విదేశాలకు వెళ్లిన తర్వాత చాలామంది ఎప్పుడెప్పుడు అక్కడి పౌరసత్వం వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.. కానీ ఓ యువకుడు మాత్రం అవకాశం, అర్హత ఉన్నప్పటికీ భారత పౌరసత్వం వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. తొమ్మిదేళ్లుగా విదేశీ గడ్డపై నివసిస్తున్నా సరే భారతీయతను వదులుకోలేకపోతున్నానని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. చర్చనీయాంశంగా మారిన ఈ పోస్టు వివరాలు..
 
మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లారు. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే ఓ ఏఐ సంస్థను స్థాపించారు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుడయ్యారు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదని ఆయన చెప్పారు. తన దృష్టిలో పాస్ పోర్ట్ అంటే కేవలం ఓ డాక్యుమెంట్ కాదని, అది తన వ్యక్తిత్వ గుర్తింపని చెప్పారు. ఇప్పటికీ తాను భారతీయతను వదులుకోలేకపోతున్నానని, జర్మన్ పౌరుడినని తాను ఫీల్ కావడంలేదన్నారు.

జర్మనీ జట్టు ఫుట్ బాల్ మ్యాచ్ లో ఓడిపోయినా, గెలిచినా తనకు ఎలాంటి ఫీలింగ్ రావడం లేదన్నారు. అదే భారత జట్టు వరల్డ్ కప్ గెలిస్తే తనకు ఎంతో భావావేశం కలుగుతుందని మయూఖ్ చెప్పారు. ఓ భారతీయుడిగా భారత జట్టు విజయాన్ని తన మనసు సెలబ్రేట్ చేసుకుంటుందన్నారు. జర్మనీ విషయంలో తనకు ఆ భావన కలగడం లేదన్నారు. 

వాస్తవానికి తాను ప్రస్తుతం ఉంటున్న బెర్లిన్ నగరంలో తనకు అన్ని సౌకర్యాలు ఉన్నా, స్థానిక సంస్కృతిలో తాను కలిసిపోయినా కూడా వందలాది ఏళ్ల చరిత్రను సొంతం చేసుకోలేకపోతున్నానని వివరించారు. అందుకే భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి మనసు అంగీకరించడం లేదని మయూఖ్ చెప్పుకొచ్చారు. భారత పౌరసత్వం తన మూలాలకు, తన ఉనికికి ప్రతీక అని, ఇక ముందు కూడా తాను భారతీయుడిగానే ఉంటానని మయూఖ్ తెలిపారు.
German citizenship
NRI
Berlin
Mayukh Panja
Germany
Indian citizenship
Indian culture
dual citizenship
Indian passport
AI startup

More Telugu News