New Labour Codes 2025: కొత్త లేబర్ కోడ్స్.. మీ జీతం తగ్గబోతోందా? పెరగబోతోందా?

Employee Salary May Decrease Due to New Labor Codes
  • దేశంలో 4 కొత్త కార్మిక చట్టాల అమలుకు కేంద్రం సన్నాహాలు
  • మొత్తం జీతంలో తప్పనిసరి కానున్న 50 శాతం బేసిక్ పే  
  • తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ.. పెరగనున్న పీఎఫ్, గ్రాట్యుటీ
  • ఉద్యోగుల వేతన నిర్మాణం మార్చనున్న కంపెనీలు
  • వేరియబుల్ పేపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్న యాజమాన్యాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నాలుగు కొత్త కార్మిక చట్టాలు (లేబర్ కోడ్స్) ఉద్యోగుల వేతన స్వరూపాన్ని పూర్తిగా మార్చనున్నాయి. దేశంలోని 29 పాత కార్మిక చట్టాల స్థానంలో అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం వల్ల నెలనెలా చేతికొచ్చే జీతం (టేక్ హోమ్ శాలరీ) తగ్గనుండగా, పదవీ విరమణ ప్రయోజనాలు గణనీయంగా పెరగనున్నాయి.  నవంబర్ 21 నుంచే లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. 

ఏమిటీ కొత్త నిబంధన?
కొత్త కార్మిక చట్టాల ప్రకారం, ఉద్యోగి మొత్తం వేతనంలో (CTC) అలవెన్సులు 50 శాతానికి మించకూడదు. అంటే, బేసిక్ పే (మూల వేతనం), కరవు భత్యం (డీఏ) వంటివి కలిపి కనీసం 50 శాతం ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ పేను తక్కువగా చూపి, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులను ఎక్కువగా ఇస్తున్నాయి. కొత్త నిబంధనతో ఈ విధానానికి తెరపడనుంది.

ఉద్యోగులపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ నిబంధన అమలు కోసం కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగుల బేసిక్ పేను పెంచాల్సి ఉంటుంది. బేసిక్ పే పెరిగినప్పుడు, దానిపై లెక్కించే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), గ్రాట్యుటీ వాటా కూడా పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగి రిటైర్మెంట్ నిధి భారీగా పెరుగుతుంది. అయితే, పీఎఫ్, గ్రాట్యుటీకి ఎక్కువ మొత్తం మినహాయించడం వల్ల నెలనెలా చేతికొచ్చే జీతం తగ్గుతుంది.

ఈ మార్పుల వల్ల కంపెనీలపైనా ఆర్థిక భారం పెరగనుంది. ఉద్యోగి పీఎఫ్, గ్రాట్యుటీకి యాజమాన్యం చెల్లించాల్సిన వాటా కూడా పెరుగుతుంది. అయితే, వేరియబుల్ పే లేదా పనితీరు ఆధారిత బోనస్‌ను ఈ 50 శాతం వేతనంలో భాగంగా పరిగణిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై తుది నిబంధనల కోసం కంపెనీలు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద, ఈ కొత్త చట్టాలు ఉద్యోగులకు దీర్ఘకాలిక సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో వస్తున్నప్పటికీ, తక్షణ ప్రభావంగా నెలవారీ జీతాల్లో మార్పులు తీసుకురానున్నాయి.
New Labour Codes 2025
Employee Salary
Basic Pay
Provident Fund
Gratuity
Retirement Benefits
CTC
DA
Wage Structure

More Telugu News