2027 ప్రపంచకప్.. కోహ్లీ, రోహిత్ ఎంపికపై సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు

  • వన్డే జట్టులో కోహ్లీ, రోహిత్ స్థానాన్ని ప్రశ్నించడం సరికాద‌న్న బంగ‌ర్‌
  • దిగ్గజ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రత్యేక వెసులుబాటు ఇవ్వాల‌ని వ్యాఖ్య‌
  • యువ ఆటగాళ్లలా వారు అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌  
  • వారి అనుభవాన్ని గౌరవించాలన్న మాజీ బ్యాటింగ్ కోచ్
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై జరుగుతున్న చర్చను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తీవ్రంగా ఖండించాడు. భారత క్రికెట్‌కు వారు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని, వారిద్దరికీ తగినంత స్వేచ్ఛ, వెసులుబాటు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డాడు. వారి అనుభవాన్ని, సామర్థ్యాన్ని శంకించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే కోహ్లీ, రోహిత్ తప్పనిసరిగా దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడాలంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో బంగర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు దూరమైన ఈ ఇద్దరు దిగ్గజాలు సుదీర్ఘకాలం ఫామ్, ఫిట్‌నెస్ కొనసాగించడంపై బీసీసీఐకి సందేహాలు ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

జియోహాట్‌స్టార్‌లో మాట్లాడుతూ బంగర్ ఈ అంశంపై స్పందించాడు. "జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థానంపై అసలు ప్రశ్నే తలెత్తకూడదు. ఇన్నేళ్లుగా వారు జట్టు కోసం ఏం చేశారో చూడండి. రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు కాబట్టి, తిరిగి ఫామ్‌లోకి రావడానికి వారికి కొన్ని సెషన్లు చాలు. యువ ఆటగాళ్లలా వారు అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. వారు ఫిట్‌గా, ఆడేందుకు ఆసక్తిగా ఉన్నప్పుడు అలాంటి నాణ్యమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. వారిని భిన్నంగా చూస్తూ, తగినంత వెసులుబాటు కల్పించాలి" అని బంగర్ తెలిపాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో 38 ఏళ్ల రోహిత్ 57, 75 పరుగులు చేయగా, 37 ఏళ్ల కోహ్లీ 135, 102, 65 నాటౌట్ స్కోర్లతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడని బంగర్ గుర్తుచేశాడు. "వారు ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్నే మార్చేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News