Malla Reddy: మల్లారెడ్డి వేల ఎకరాలు కబ్జా చేశారు: కవిత తీవ్ర ఆరోపణలు

Kavitha Alleges Malla Reddy Grabbed Thousands of Acres in Medchal
  • మల్లారెడ్డి పూలు, పాలు అమ్మి వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపణ
  • మేడ్చల్‌లో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శ 
  • భూముల క్రమబద్ధీకరణలో అవకతవకలపై సుప్రీంకు వెళ్తానని వెల్లడి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్‌లో పూలు, పాలు అమ్ముకొని వేల ఎకరాలు కబ్జా చేశారే తప్ప, గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా నిన్న ఆమె మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించారు.

ముందుగా జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డును పరిశీలించిన కవిత, అనంతరం అంబేద్కర్‌నగర్‌లో బస్తీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేడ్చల్‌లో అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. తన పర్యటనలో తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని గుర్తించానని తెలిపారు. నియోజకవర్గంలో సరైన డిగ్రీ, జూనియర్ కళాశాలలు లేకపోవడంతో యువత ఉన్నత చదువులకు దూరమై గంజాయి వంటి వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో నం.58, 59 కింద భూముల క్రమబద్ధీకరణ పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయలేదని కవిత ఆరోపించారు. అదే సమయంలో మాజీ మేయర్, మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. అనంతరం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపయ్యాయని కూడా ఆమె విమర్శించారు.
Malla Reddy
Kalvakuntla Kavitha
Medchal
Telangana Jagruthi
Land Grabbing
Ganja Addiction
GO 58
GO 59
Jawahar Nagar Dumping Yard
Farmers Issues

More Telugu News