Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్​' గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

Telangana Rising Global Summit Ready to Start
  • రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సు
  • 44 దేశాల నుంచి హాజరుకానున్న 154 మంది ప్రతినిధులు, వ్యాపారవేత్తలు
  • రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం
  • రేపు విజన్-2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్న ప్రభుత్వం
హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్'కు స‌ర్వం సిద్ధ‌మైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి సుమారు 154 మంది అంతర్జాతీయ అతిథులతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజ‌రుకానున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ పాలసీలు, విజన్-2047 లక్ష్యాలను ఆయన వివరించనున్నారు. ఈ సదస్సులో నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా వంటి పలువురు ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.

మొత్తం 27 అంశాలపై చర్చలు, సమావేశాలు
రెండు రోజుల సదస్సులో భాగంగా ఏరో స్పేస్, గ్రీన్ మొబిలిటీ, సెమీ కండక్టర్లు, లైఫ్ సైన్సెస్, మూసీ పునరుజ్జీవనం వంటి మొత్తం 27 అంశాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న 'తెలంగాణ విజన్ రైజింగ్ డాక్యుమెంట్-2047'ను రేపు ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపై ఈ దార్శనిక పత్రం స్పష్టత ఇవ్వనుంది.

అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు 
సదస్సుకు హాజరయ్యే అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలను అందించనున్నారు. ఇప్పపువ్వు లడ్డు, సకినాలు వంటి తెలంగాణ ప్రత్యేక వంటకాలతో కూడిన మరో బాస్కెట్‌ను సైతం అందించనున్నారు. సాయంత్రం కీరవాణి సంగీత కచేరి ఉంటుంది. అలాగే కొమ్ము కోయ, బంజారా, గుస్సాడీ, ఒగ్గు డోలు, పేరిణీ నాట్యం, బోనాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ షో  కూడా ఏర్పాటు చేశారు. పోచంపల్లి ఇక్కత్‌ శాలువా, చేర్యాల కళాకృతులు తదితరాలతో కూడిన జ్ఞాపికలను ప్రభుత్వం తరఫున అందించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ విడుదలతో సదస్సు ముగియనుంది.
Telangana Rising Global Summit
Revanth Reddy
Telangana investments
Telangana vision 2047
Hyderabad summit
Global summit India
Kiran Mazumdar Shaw
Abhijit Banerjee
Kailash Satyarthi
Telangana economy

More Telugu News