Sadhineni Yamini Sharma: కూచిపూడిలో అద్భుతం.. బిల్లులే లేని ప్రపంచ స్థాయి ఆసుపత్రి!

Sadhineni Yamini Sharma Praises Free Hospital in Kuchipudi
  • కూచిపూడిలోని ఉచిత ఆసుపత్రిపై యామినీ శర్మ ప్రశంసలు
  • అన్ని వైద్య సేవలు, సర్జరీలు పూర్తిగా ఉచితమని వెల్లడి
  • 'ఇదే నిజమైన దేశ నిర్మాణం' అంటూ భావోద్వేగ ట్వీట్
ప్రపంచ ప్రఖ్యాత నాట్య క్షేత్రం కూచిపూడిలో ఎటువంటి రుసుము లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఒక ఆసుపత్రిని ఏపీకి చెందిన బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ సాధినేని యామినీ శర్మ ప్రశంసించారు. తాను సందర్శించిన ఈ ఆసుపత్రిని చూసి నిశ్చేష్టురాలినయ్యానని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇది కేవలం ఆసుపత్రి మాత్రమే కాదని, మానవత్వానికి నిలువుటద్దమని ఆమె కొనియాడారు.

ఈ ఆసుపత్రి పూర్తిగా విరాళాలతో నడుస్తోందని యామినీ శర్మ తెలిపారు. ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షల నుంచి పెద్ద పెద్ద శస్త్రచికిత్సల వరకు అన్నీ రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాంటి బిల్లులు, షరతులు, వివక్ష లేకుండా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని ఆమె అన్నారు. అధునాతన వైద్య పరికరాలు, పరిశుభ్రమైన వాతావరణం ఇక్కడి నిబద్ధతకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల దార్శనికత, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాశ్ వంటి ఎందరో దాతల సహకారంతో ఈ అద్భుతమైన వైద్యాలయం రూపుదిద్దుకుందని యామినీ శర్మ వివరించారు. ఇది కేవలం ఆసుపత్రి మాత్రమే కాదని, మానవత్వం, సేవ, నిజమైన దేశ నిర్మాణం అంటే ఇదేనని తాను భావిస్తున్నానని చెబుతూ.. ఈ సంస్థను చూసి గర్వంగా, భావోద్వేగంగా ఉందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. 
Sadhineni Yamini Sharma
Kuchipudi
Anand Kuchibhotla
Ravi Prakash
Free Hospital
SiliconAndhra
Healthcare
Andhra Pradesh
Charity Hospital
World Class Healthcare

More Telugu News