ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. నాలుగుకు చేరిన మరణాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి
  • కృష్ణా జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో వ్యక్తి మృతి
  • రిపోర్ట్ వచ్చే లోపే మరణించిన బాధితుడు
  • ప్రభావిత గ్రామంలో వైద్య బృందాల సర్వే
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. పురుగు కాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం, మొదునూరు గ్రామానికి చెందిన శివశంకర్ (44) అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించడంతో ఈ నెల 2న వైద్య అధికారులు ఆయన నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదిక రాకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం వచ్చిన రిపోర్టులో ఆయనకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ మరణంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి మరింత ప్రబలకుండా నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందాలు మొదునూరు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురుగుకాటుకు గురైనప్పుడు లేదా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.


More Telugu News