వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం... సిరీస్ కైవసం

  • మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్
  • 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
  • అజేయ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్
  • చెరో నాలుగు వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. విశాఖపట్నం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో సఫారీ జట్టును చిత్తు చేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

271 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ (75) దూకుడుగా ఆడగా, యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. జైస్వాల్ స్కోరులో 12 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 65 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 39.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేసింది. సఫారీ జట్టులో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ బవుమా (48) ఫర్వాలేదనిపించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించారు. అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.


More Telugu News