Chandrababu Naidu: పరకామణి చోరీ చిన్న దొంగతనమా?... సెటిల్ చేయడానికి జగన్ ఎవరు?: సీఎం చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu Fires on Jagans Comments on Tirumala Theft
  • పరకామణి చోరీపై జగన్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్న చంద్రబాబు
  • బాబాయి హత్య తరహాలోనే దేవుడి సొమ్ముతో సెటిల్మెంట్లా అని ఫైర్
  • రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టీకరణ
  • నెల్లూరులో లేడీ డాన్లు తయారవడం ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి పరకామణి చోరీని 'చిన్న దొంగతనం'గా అభివర్ణిస్తూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని, జగన్‌కు దేవుడన్నా, భక్తులన్నా, ఆలయాల పవిత్రత అన్నా ఏమాత్రం లెక్కలేదని మండిపడ్డారు. శనివారం నాడు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

"బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి, ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం కంటే ఘోరం ఉంటుందా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి చెల్లించాడు కదా, తప్పేముందని జగన్ వాదించడం అనైతికమని అన్నారు. 

"భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి? రూ.72 వేలు అనేది చిన్న మొత్తమే కావచ్చు, కానీ దేవుడి హుండీలో చోరీ చేయడం చిన్న తప్పా? దాన్ని సెటిల్ చేయడం మహాపాపం కాదా?" అని చంద్రబాబు నిలదీశారు. కోట్ల మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడటం ఘోరమని, జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందని తెలిపారు.

నెల్లూరులో లేడీ డాన్లు తయారవడం ఆశ్చర్యం కలిగించింది

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రశాంతంగా ఉండే ప్రాంతాలను సైతం నేరమయం చేసిందని, నేరస్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. నెల్లూరులో లేడీ డాన్లు తయారవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

"ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో గతంలో ఎలాంటి అధికారులను ఎస్పీలుగా నియమించినా సరిపోయేది. కానీ గత ఐదేళ్ల పాలనలో అక్కడ కూడా నేరస్తులు తయారయ్యారు. నెల్లూరులో ఏకంగా లేడీ డాన్లను తయారు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంస్కృతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. నేరస్తులను ఏరివేస్తాం, రౌడీలను అణిచివేస్తాం" అని హెచ్చరించారు.

రాజధాని పనుల్లో వేగం... విద్యారంగంలో మార్పులు

రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, దీంతో నిర్మాణ పనుల్లో వేగం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల తాను రైతులతో నిర్వహించిన సమావేశం సత్ఫలితాలనిచ్చిందని, రెండో దశ భూ సమీకరణకు కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు, ప్రభుత్వం సంతోషంగా ఉంటే కొందరికి మాత్రం కడుపు మండుతోందని పరోక్షంగా విమర్శించారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మెగా పేరెంట్ టీచర్ మీటింగ్' ఒక బ్రాండ్‌గా మారిందని, విద్యాశాఖలో నారా లోకేశ్ తీసుకువస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చంద్రబాబు వివరించారు.
Chandrababu Naidu
Tirumala
Parakamani
Jagan Mohan Reddy
Theft
Andhra Pradesh Politics
Nellore
Amaravati
TDP
Crime

More Telugu News