Omar Abdullah: ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉంది: ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah Says India Alliance on Ventilator
  • నితీశ్ కుమార్‌ను మళ్లీ ఎన్డీయే వైపు తామే నెట్టేసినట్లు అనిపిస్తోందన్న ఒమర్ అబ్దుల్లా
  • ఎన్నికల్లో  బీజేపీ పోరాడే తీరుపై ప్రశంసలు
  • ఈవీఎంల విషయంలో అనుమానాలు లేవని వెల్లడి
'ఇండియా' కూటమిపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను మళ్లీ ఎన్డీయే వైపు తామే నెట్టేసినట్లు అనిపిస్తోందని అన్నారు. బీహార్ ఎన్నికల అనంతరం పరిస్థితి మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో బీజేపీ పోరాడే తీరును ఆయన ప్రశంసించారు. అయితే తనకు ఆ పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు లేవని, ఆ పార్టీ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇండియా కూటమి కోసం గతంలో నితీశ్ కుమార్ చేసిన ప్రయత్నాలను ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. ఆయనను తామే ఎన్డీయేలోకి వెళ్లేలా చేసినట్లు తాను భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి వెంటిలేటర్‌పై ఉన్నట్లుగా ఉందని పేర్కొన్నారు.

కోలుకుంటున్నామని భావించే సమయానికి బీహార్ వంటి ఫలితాలు పరిస్థితిని మరింత దిగజార్చాయని అన్నారు. తాము ఒక కూటమిగా చెప్పుకుంటున్నామంటే మరింత సమగ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ అద్భుతంగా పోరాడిందని, ఎన్నికల పైనే తమ జీవితాలు ఆధారపడినట్లుగా వ్యవహరించిందని అన్నారు. కానీ ఇండియా కూటమి పట్టింపులేనట్లుగా వ్యవహరించిందని విమర్శించారు.

ఎన్నికల ఫలితాల తారుమారు విషయంలో ఈవీఎంలపై అనుమానాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కానీ ఓటరు జాబితాలను మార్చడం, నియోజకవర్గాల పునర్విభజన వంటి చర్యలతో ఇది సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన తాను బీజేపీతో పొత్తులో ఉన్నట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Omar Abdullah
India Alliance
Jammu Kashmir
Nitish Kumar
NDA
Bihar Elections

More Telugu News