గుమ్మడి నర్సయ్య కాళ్లు మొక్కిన శివన్న... ఇదిగో వీడియో!

  • పాల్వంచలో లాంఛనంగా ప్రారంభమైన 'గుమ్మడి నర్సయ్య' బయోపిక్
  • సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెబుతానన్న శివరాజ్ కుమార్
  • నర్సయ్యలో తన తండ్రిని చూసుకున్నానంటూ భావోద్వేగం
  • యువ రాజకీయ నాయకులకు ఈ సినిమా స్ఫూర్తినిస్తుందన్న శివన్న
నిరాడంబర రాజకీయాలకు నిలువుటద్దంలా నిలిచిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లాంఛనంగా ప్రారంభమైంది. ‘గుమ్మడి నర్సయ్య’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. శనివారం పాల్వంచలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుమ్మడి నర్సయ్య, శివ రాజ్‌కుమార్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ... గుమ్మడి నర్సయ్య లాంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తనకు తన తండ్రి, దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్‌ గుర్తుకొచ్చారని భావోద్వేగంగా తెలిపారు. "నర్సయ్య గారిలో నేను మా నాన్నను చూసుకున్నాను. ఇతరుల కోసం జీవించాలనేది మా నాన్న సిద్ధాంతం. ఆయన ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న ఇంటికి వెళ్లినట్లే అనిపించింది. ఈ మాట మనస్ఫూర్తిగా చెబుతున్నా" అని శివన్న అన్నారు.

ఈ సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుని, స్వయంగా డబ్బింగ్ చెబుతానని శివరాజ్ కుమార్ ప్రకటించారు. "ప్రస్తుతం నాకు తెలుగు అంత బాగా రాదు. కానీ డైలాగ్స్ ఫీల్‌తో చెప్పాలంటే భాష వచ్చి ఉండాలి. నెక్స్ట్ టైమ్ నేను పాల్వంచకు వస్తే, తెలుగులో బాగా మాట్లాడతాను. ఇది నా ప్రామిస్" అని అన్నారు. 

ఈ సినిమా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తుందని, గుమ్మడి నర్సయ్య ప్రజల కోసం ఎలా జీవించారో చూసి నేర్చుకోవాలని సూచించారు. ప్రసంగం అనంతరం ఆయన గుమ్మడి నర్సయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.


More Telugu News