గెడ్డంతో గుర్తుపట్టలేనంతగా మారిన జూనియర్ ఎన్టీఆర్.. లుక్‌పై ట్రోలింగ్

  • మలబార్ గోల్డ్ యాడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్
  • గుబురు గెడ్డంతో విభిన్నంగా కనిపించిన తారక్
  • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు, ట్రోలింగ్
టాలీవుడ్ అగ్రహీరోర జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ జ్యువెలరీ సంస్థ 'మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్' విడుదల చేసిన తాజా యాడ్‌లో తారక్ సరికొత్త అవతారంలో కనిపించారు. గుబురుగా పెరిగిన గెడ్డం, కాస్త సన్నబడిన శరీరంతో ఉన్న ఆయన లుక్ ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే, 'ఆర్ఆర్ఆర్', 'దేవర' వంటి బ్లాక్‌బస్టర్లతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్... ఇటీవల 'వార్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన మలబార్ యాడ్‌లో ఆయన లుక్ అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపించే తారక్‌కు ఈ లుక్ భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది నెటిజన్లు "ఈ లుక్ అంతగా సెట్ అవ్వలేదు", "హెయిర్ స్టైల్ బాగోలేదు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, స్టార్ హీరోలు తమ తర్వాతి సినిమా పాత్రల కోసం లుక్ మార్చడం సహజమని, బహుశా ప్రశాంత్ నీల్ సినిమా కోసమే తారక్ ఇలా సిద్ధమవుతున్నారని ఆయన అభిమానులు బలంగా వాదిస్తున్నారు. ఏదేమైనా, ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించిన లుక్‌పై ఈ స్థాయిలో చర్చ జరగడం ఎన్టీఆర్ క్రేజ్‌కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


More Telugu News