సినిమాలు, ఓటీటీ సిరీస్ లు... గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచడంపై పవన్ కీలక ఆదేశాలు

  • ఎకో టూరిజం, ఉద్యాన పంటల ద్వారా ఉపాధి కల్పనకు సూచన
  • ఉపాధి హామీ పథకంతో ఉద్యాన పంటల అనుసంధానం
  • ఏజెన్సీలో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించాలని దిశానిర్దేశం
అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వాటి తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గిరిజనుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని పవన్ తెలిపారు. అదేవిధంగా, ఏజెన్సీలోని జలపాతాలు, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి ఎకో టూరిజం ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల రైతులకు, కూలీలకు ప్రయోజనం చేకూరుతుందని, ఏజెన్సీలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో సినిమా, ఓటీటీ ప్రాజెక్టుల షూటింగ్‌లను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చని తెలిపారు.

గంజాయి సాగు నిర్మూలన అంశంపై కూడా సమీక్షించిన పవన్, గిరిజనులు ఆ వైపు వెళ్లకుండా వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గిరిజన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రతి నెలా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అధికారుల సమన్వయంతో గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


More Telugu News