RO-KO: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన 14 ఏళ్ల కుర్రాడు.. 2025లో టాప్ సెర్చ్ ఇతనే!

Vaibhav Suryavanshi Overtakes Kohli Rohit in Google Search 2025
  • 2025లో భారత్‌లో అత్యధికంగా వెతికిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశీ
  • జాబితాలో వెనకబడిన సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
  • ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ రికార్డు సెంచరీ
  • ప్రపంచవ్యాప్త గూగుల్ సెర్చ్ జాబితాలోనూ ఆరో స్థానంలో నిలిచిన వైభవ్
భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల శకం ముగిసిపోతోందా? వారి స్థానాన్ని యువ సంచలనాలు భర్తీ చేస్తున్నాయా? గూగుల్ విడుదల చేసిన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' జాబితాను చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. కేవలం 14 ఏళ్ల వయసున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా వెతికిన వ్యక్తిగా నిలిచి సంచలనం సృష్టించాడు. భారత క్రికెట్‌ను ఏలిన కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు ఈ జాబితాలో వెనకబడటం గమనార్హం.

ఐపీఎల్ 2025తో వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేయగా, తన ఆటతో ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి, ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు సాధించాడు.

వైభవ్ తర్వాత ఈ జాబితాలో మరో ఇద్దరు యువ క్రికెటర్లు ప్రియాన్ష్ ఆర్య, అభిషేక్ శర్మ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ 17 మ్యాచ్‌లలో 475 పరుగులు చేయగా, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు.

ప్రపంచవ్యాప్తంగా వైభవ్ ముద్ర
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వైభవ్ తన ముద్ర వేశాడు. గూగుల్ గ్లోబల్ సెర్చ్ జాబితాలో అత్యధికంగా సెర్చ్‌ వ్యక్తుల్లో ఆరో స్థానం దక్కించుకున్నాడు. అండర్-19, ఇండియా-ఏ జట్ల తరఫున కూడా వైభవ్ రికార్డులు సృష్టించాడు. అండర్-19 వన్డేల్లో 52 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్, అసాధారణ ప్రతిభే ఈ యువ సంచలనాన్ని ప్రజలకు మరింత చేరువ చేసింది.
RO-KO
Vaibhav Suryavanshi
Virat Kohli
Rohit Sharma
IPL 2025
Indian Cricket
Rajasthan Royals
Priyansh Arya
Abhishek Sharma
Google Year in Search 2025
Cricket Records

More Telugu News