Nitish Kumar: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నితీశ్ కుమార్..

Nitish Kumar Enters World Book of Records as Bihar CM
  • పదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్
  • భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అరుదైన ఘనతగా గుర్తింపు
  • నితీశ్‌కు అభినందన లేఖ పంపిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ
బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో, ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి, తమ జాబితాలో చేర్చింది. ఈ మేరకు సదరు సంస్థ నితీశ్ కుమార్‌కు ప్రత్యేకంగా అభినందన లేఖను పంపింది.
 
ఒకే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని పదిసార్లు పాలించడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన ఘనత అని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన లేఖలో పేర్కొంది. "1947 నుంచి 2025 మధ్య కాలంలో పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి వ్యక్తిగా నిలవడం భారతదేశానికి గర్వకారణం. ఇది మీ అంకితభావానికి, దార్శనిక నాయకత్వానికి నిదర్శనం. బీహార్ ప్రజలు మీపై ఉంచిన విశ్వాసానికి ఈ అసాధారణ విజయం తార్కాణం" అని ప్రశంసించింది.
 
సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం నితీశ్‌ కుమార్ చేస్తున్న కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఆ సంస్థ కొనియాడింది. ఆయన నాయకత్వ పటిమ వల్లే పదేపదే ప్రజల మన్ననలు పొందుతున్నారని వివరించింది. ఈ అరుదైన గౌరవం దక్కడంతో నితీశ్‌ కుమార్‌కు పలువురి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Nitish Kumar
Bihar Chief Minister
JDU Leader
World Book of Records
Tenure Record
Bihar Politics
Indian Democracy
Political Achievement

More Telugu News