Tammareddy Bharadwaja: చిత్రపురి కాలనీ వివాదం: డబ్బు తినలేదు కానీ.. బాధ్యత తనదేనన్న తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja Accepts Responsibility in Chitrapuri Colony Issue
  • చిత్రపురి కాలనీలో వందల కోట్ల అవినీతి జరగలేదన్న తమ్మారెడ్డి
  • నివేదికలో తన పేరు ఉండటంతోనే స్పందించానన్న దర్శకనిర్మాత
  • గతంలో కమిటీలో ఉన్నందునే తన పేరు చేర్చారని వివరణ
  • తన బాధ్యతా రాహిత్యానికి డబ్బు చెల్లించడానికి సిద్ధమని స్పష్టీకరణ
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి అందిన నివేదికలో తన పేరు ఉండటంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాను ఎలాంటి నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని, వందల కోట్ల అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే, గతంలో కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో జరిగిన ఒక పొరపాటుకు బాధ్యత వహిస్తూ, నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

తాను కమిటీలో చేరినప్పుడు చిత్రపురి ప్రాజెక్టు విలువ రూ.180 కోట్లు మాత్రమేనని, ప్రస్తుతం అది రూ.500 కోట్లకు చేరిందని అన్నారు. ప్రాజెక్టు మొత్తం విలువే అంత ఉంటే, వందల కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. కేవలం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"గతంలో కమిటీలో సభ్యుడిగా ఉన్నందునే నా పేరు నివేదికలో ఉంది. 2005 నుంచి 2010 వరకు ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదికలోనే ఉంది. ఆ సమయంలో నేను కొంతకాలం సెక్రటరీగా ఉన్నాను. 2015 తర్వాత నేను కమిటీ నుంచి వైదొలిగాను. అప్పటి నుంచి జరిగిన వ్యవహారాలతో నాకు సంబంధం లేదు" అని తమ్మారెడ్డి వివరించారు.

అయితే, తాను కమిటీలో ఉన్నప్పుడు ఓ సభ్యుడు వాటర్ వర్క్స్ కోసం చెల్లించిన రూ.30 లక్షల వివరాలను మినిట్స్‌లో నమోదు చేయకపోవడం తన బాధ్యతా రాహిత్యమేనని ఆయన అంగీకరించారు. అందుకే, ఆ డబ్బును చెల్లించడానికి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా, వెళ్లడం లేదని భరద్వాజ స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీ అక్రమాలపై గోల్కొండ కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
Tammareddy Bharadwaja
Chitrapuri Colony
Chitrapuri Housing Society
Corruption allegations
Golconda Cooperative
Real estate scam
Telangana news
Movie industry
Housing society issues
Film producer

More Telugu News