Nallamasa Praveen: దక్షిణాఫ్రికాలో భువనగిరి యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

Telangana Youth Nallamasa Praveen Kidnapped in Mali South Africa
  • మాలిలో ప్రవీణ్‌ను అపహరించిన ఉగ్రవాదులు
  • గత నెల 23న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి 
  • కుమారుడిని విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి తల్లిదండ్రుల వేడుకోలు
  • భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ
జీవనోపాధి కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నల్లమాస ప్రవీణ్ దక్షిణాఫ్రికాలోని మాలిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. తమ కుమారుడిని సురక్షితంగా విడిపించి స్వదేశానికి తీసుకురావాలని అతడి తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్. హైదరాబాద్‌లోని ఓ బోర్‌వెల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద గత ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలోని మాలి రాష్ట్రానికి వెళ్లాడు. రోజూ ఫోన్‌లో తల్లిదండ్రులతో మాట్లాడే ప్రవీణ్, గత నెల 22న చివరిసారిగా సంప్రదించాడు.

మరుసటి రోజు, నవంబర్ 23న విధులకు వెళ్లి తిరిగి గదికి వస్తుండగా మార్గమధ్యలో జేఎన్ఐఎం అనే ఉగ్రవాద సంస్థ అతడిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ నెల 4న కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి ప్రవీణ్ కిడ్నాప్ అయిన విషయాన్ని తల్లిదండ్రులకు ధ్రువీకరించారు.

ప్రస్తుతం ప్రవీణ్ ఆచూకీ కోసం కంపెనీ యాజమాన్యం భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఉగ్రవాద సంస్థ గతంలోనూ పలువురు విదేశీయులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తల్లిదండ్రులు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.
Nallamasa Praveen
South Africa
Mali
Kidnapping
JNIM
Terrorists
Telangana
Bhuvanagiri
Indian Embassy

More Telugu News