మరోసారి విదేశీ పర్యటనకు మంత్రి నారా లోకేశ్... భారీ పెట్టుబడులే టార్గెట్

  • రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన
  • డిసెంబర్ 6 నుంచి 10 వరకు అమెరికా, కెనడాలో టూర్
  • పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్న లోకేశ్
  • కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేశ్ కు ఇది రెండో అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆయన అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు.

పర్యటనలో భాగంగా డిసెంబర్ 6న లోకేశ్ అమెరికాలోని డల్లాస్‌లో జరిగే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి.

గత 18 నెలల కాలంలో పెట్టుబడుల సాధన కోసం లోకేశ్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న బ్రాండ్ ఇమేజ్, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించడంలో ఈ పర్యటనలు విజయం సాధించాయి. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు (పార్టనర్‌షిప్ సమ్మిట్)కు భారీగా పెట్టుబడులు తరలిరావడంలో ఈ పర్యటనలు కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో లోకేశ్ అమెరికాలో పర్యటించడం ద్వారా గూగుల్ ను రాష్ట్రానికి రప్పించగలిగారు. ఈసారి కూడా లోకేశ్ భారీ పెట్టుబడులు సాధించుకువస్తారని కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. 


More Telugu News