పుతిన్ భారత పర్యటన... అమెరికాపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు

  • పుతిన్ పర్యటన రష్యా, భారత్ మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెలియజేస్తుందని వెల్లడి
  • ఈ రెండు దేశాలు పాశ్చాత్య ఒత్తిడికి తలొగ్గవని వ్యాఖ్య
  • అమెరికా ఆంక్షలు, ఒత్తిడి ఫలించకపోవచ్చన్న చైనా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్యా చమురు సహా వివిధ ఉత్పత్తులపై అమెరికా ఆంక్షలు, అధిక సుంకాలు విధించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ రెండు రోజుల భారత పర్యటనను ప్రపంచ మీడియా ఆసక్తిగా చూస్తోంది. అమెరికా నుంచి ఉక్రెయిన్ వరకు ఉన్న మీడియా సంస్థలన్నీ ఈ పర్యటనను ప్రముఖంగా కవర్ చేస్తున్నాయి.

రష్యా, భారత్ మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఈ పర్యటన స్పష్టమైన సందేశాన్ని పంపిస్తుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ రెండు దేశాలు పాశ్చాత్య ఒత్తిడికి తలొగ్గవని తెలిపింది. ప్రపంచంలో ఏ దేశమూ ఒంటరి కాదన్న సందేశాన్ని పుతిన్ పర్యటన చాటుతోందని చైనా మీడియా పేర్కొంది.

చైనా ఫారెన్ అఫైర్స్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ లీ హైడాంగ్ గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, భారత్, రష్యా దేశాలు ఎవరిపైనా ఆధారపడకుండా, తమ సామర్థ్యాలను తామే సొంతంగా, మరింత శక్తిమంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయని అర్థమవుతోందని అన్నారు. ఇరుదేశాల మధ్య సమన్వయం, సహకారమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉభయ దేశాలు పరస్పర మద్దతుతో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు, ఒత్తిడి అంతగా ఫలించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.


More Telugu News