'అఖండ 2' వాయిదాపై సురేశ్‌ బాబు క్లారిటీ.. అసలు విషయం చెప్పిన నిర్మాత

  • వాయిదా పడిన బాలకృష్ణ 'అఖండ 2' విడుదల
  • సోషల్ మీడియా రూమర్లకు చెక్ పెట్టిన సురేశ్‌ బాబు
  • ఆర్థిక సమస్యలే కారణమని స్పష్టం చేసిన నిర్మాత
  • నిర్మాతలు, ఫైనాన్షియర్ల మధ్య సెటిల్‌మెంట్ చర్చలు
  • సమస్య పరిష్కారం తర్వాత కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల అనూహ్యంగా నిలిచిపోయింది. ఇవాళ‌ థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం ఆగిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సినిమా విడుదల వాయిదాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు దీనిపై స్పందించి అసలు కారణాన్ని వెల్లడించారు.

‘సైక్ సిద్ధార్థ’ సినిమా ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. 'అఖండ 2' వాయిదాకు పూర్తిగా ఆర్థికపరమైన సమస్యలే కారణమని స్పష్టం చేశారు. "డబ్బుల విషయాలు బయట చర్చించాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు సినిమా చూడటమే ముఖ్యం తప్ప, ఈ వివరాలు ఎందుకు?" అని ఆయన అభిప్రాయపడ్డారు. మూవీపై వ‌చ్చే ఎటువంటి రూమర్లను నమ్మవద్దని ఆయన సూచించారు.

ఇలాంటి ఫైనాన్స్ సమస్యలు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదని, సరైన ప్రణాళికతో వీటిని అధిగమించవచ్చని సురేశ్‌ బాబు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, ఫైనాన్స్ వ్యవహారాలు చూస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్‌తో సెటిల్‌మెంట్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయిన వెంటనే, సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


More Telugu News