విజయవాడలో శివ రాజ్ కుమార్.. చంద్రబాబు బయోపిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

  • కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న శివ రాజ్ కుమార్
  • చంద్రబాబు బయోపిక్ లో నటిస్తారా అంటూ మీడియా ప్రశ్న
  • భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అప్పుడు చూస్తానని వ్యాఖ్య
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ విజయవాడలో పర్యటించారు. తన అర్ధాంగి గీతతో కలిసి తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టాలీవుడ్ నుంచి తనకు ఇప్పటికే రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చాయని, అయితే ఇంకా ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదని స్పష్టం చేశారు.

శివ రాజ్ కుమార్ ప్రస్తుతం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఎంఎల్ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో శివ రాజ్ కుమార్ అచ్చం గుమ్మడి నర్సయ్యలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. 

ఈ సందర్భంగా, "భవిష్యత్తులో మంచి దర్శకుడు వస్తే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తారా?" అని విలేకరులు అడగ్గా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఒక బయోపిక్‌లో నటించడం ఇదే తొలిసారని, భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అప్పుడు చూస్తానని బదులిచ్చారు. తెలుగు సినిమాలను మన దేశంలో కంటే ఎన్నారైలు ఎక్కువగా ఆదరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.




More Telugu News