iBomma Ravi: ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ఇచ్చారనే వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ స్పందన

iBomma Ravi Job Offer News Denied by Cyber Crime DCP
  • ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేశారంటూ ప్రచారం
  • ఆ వార్తల్లో నిజంలేదన్న సైబర్ క్రైమ్ డీసీపీ
  • రవిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని వెల్లడి
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి పోలీసులు ఉద్యోగం ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలను సైబర్ క్రైమ్ పోలీసులు ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పష్టం చేశారు. ఇటీవల రవిని విచారించినప్పుడు అతనికి జాబ్ ఆఫర్ చేశారని, దాన్ని అతను తిరస్కరించాడని వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవి చాలా తక్కువ ప్రశ్నలకే సమాధానం ఇచ్చాడని, అతనిలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించలేదని తెలిపారు. అంతేకాకుండా, రవి మూడు బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేసినట్టు తమ విచారణలో తేలిందని అరవింద్ బాబు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన వివరించారు.

తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న కేసులో పోలీసులు రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అతను బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ అతనికి బెయిల్ మంజూరైనా, మళ్లీ ఐబొమ్మను ప్రారంభించకుండా నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

iBomma Ravi
iBomma
Cyber Crime DCP
DCP Aravind Babu
Movie Piracy
Telugu Movies
Betting Apps
Cyber Crime Investigation
Ravi Arrest
Piracy Website

More Telugu News