Vladimir Putin: పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం

Vladimir Putin receives grand welcome at Rashtrapati Bhavan
  • రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన వ్లాదిమిర్ పుతిన్
  • రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం పలికిన ముర్ము, మోదీ
  • ప్రధాని మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు
  • రక్షణ, ఇంధన రంగాలపై ప్రధానంగా చర్చించే అవకాశం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయనకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల ఉన్నతాధికారులను నేతలు పరస్పరం పరిచయం చేసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో అధికారిక చర్చలు జరపనున్నారు. రక్షణ, ఇంధన సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై వీరి మధ్య చర్చలు జరగనున్నాయి. సమావేశం అనంతరం ఇరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడతారు. అనంతరం పుతిన్ వాణిజ్య, పెట్టుబడుల బలోపేతం లక్ష్యంగా జరిగే ఒక బిజినెస్ కార్యక్రమంలో పాల్గొంటారు.

గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ వ్యక్తిగతంగా వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, కరచాలనం చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రధాని అధికారిక నివాసం వరకు ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణించడం వారి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనంగా నిలిచింది. అనంతరం పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ తన నివాసంలో ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు.

ఇక‌, పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన రహదారులను భారత్-రష్యా జెండాలతో, ప్రత్యేక లైటింగ్‌తో అలంకరించారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పుతిన్ పాల్గొననున్నారు.

Vladimir Putin
Putin India visit
India Russia relations
Narendra Modi
Droupadi Murmu
Hyderabad House
Defense cooperation
Energy cooperation
Regional security
Economic partnership

More Telugu News