Somireddy Chandra Mohan Reddy: శ్రీవారి హుండీ అంటే అంత లోకువా?.. జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

Somireddy Chandra Mohan Reddy Fires on YS Jagan in the matter of TTD Hundi Robbery
  • జగన్ అహంకారంతో మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని సోమిరెడ్డి ఆరోపణ
  • శ్రీవారి విషయంలో చేసిన పాపాలే 11 సీట్లకు పరిమితం చేశాయని విమర్శ
  • జగన్ బహిరంగ క్షమాపణ చెప్పి, లెంపలు వేసుకోవాలని డిమాండ్
తిరుమల శ్రీవారి హుండీపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన జగన్ బహిరంగ క్షమాపణ చెప్పి, లెంపలు వేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

శ్రీవారి పరకామణి చోరీ కేసు విషయంలో జగన్ అహంకారంతో మాట్లాడారని సోమిరెడ్డి ఆరోపించారు. "పవిత్రమైన శ్రీవారి హుండీ అంటే అంత లోకువగా ఉందా? హుండీలో చోరీ చేస్తే తప్పేంటన్నట్టు మాట్లాడతారా? మీ వ్యాఖ్యలను హిందూ సమాజం ఎప్పటికీ క్షమించదు" అని సోమిరెడ్డి అన్నారు.

సీఎంగా ఉన్నప్పుడు జగన్ శ్రీవారి విషయంలో అనేక పాపాలు చేశారని, ఆ పాపాలే శాపాలుగా మారి ఎన్నికల్లో ఆయన్ను 11 సీట్లకు పరిమితం చేశాయని విమర్శించారు. అయినా ఆయనలో మార్పు రాలేదని, ఇంకా విర్రవీగుతున్నారని దుయ్యబట్టారు. "కోరికలు తీరిన భక్తులు తమ ఒంటిపై ఉన్న ఆభరణాలను సైతం స్వామికి సమర్పిస్తారు. కానీ, మీరు శ్రీవారినే నిలువు దోపిడీ చేసిన రకం" అని సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"భగవంతుడి విషయంలో అహంకారంతో మాట్లాడిన నిన్ను ఏ దేవుడూ క్షమించడు. నువ్వు చేసిన పాపాలకు కన్ఫెషన్ బాక్సులో కూర్చున్నా జీసస్ కూడా అసహ్యించుకుంటారు" అని అన్నారు. వైసీపీలోని హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ఇతర మతాలను కించపరచడాన్ని సమర్థించరని సోమిరెడ్డి హితవు పలికారు.
Somireddy Chandra Mohan Reddy
YS Jagan
TTD
Tirumala

More Telugu News