తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు.. నేడు ఆన్‌లైన్‌లో విడుదల

  • జనవరి 2 నుంచి 8 వరకు దర్శనానికి సంబంధించిన కోటా విడుదల
  • ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్లు
  • మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్యమైన సమాచారం అందజేసింది. పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటాను ఈరోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు జరిగే దర్శనాల కోసం ఈ టికెట్లు అందుబాటులో వుంటాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీవాణి కోటా టికెట్లను విడుదల చేస్తారు. రోజుకు వెయ్యి టికెట్ల చొప్పున ఏడు రోజులకు సంబంధించిన కోటాను భక్తులు బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కోటాలో భాగంగా రోజుకు 15 వేల టికెట్లు కేటాయించారు.

వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు సంబంధించిన టికెట్లను ఇదివరకే ఈ-డిప్ విధానంలో కేటాయించినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం మిగిలిన ఏడు రోజులకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 


More Telugu News