ఈ చదువులు నా వల్ల కాదు.. సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య

  • హైదరాబాద్‌లో చదువుల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య
  • ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న సిద్ధార్థ
  • సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
  • తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేకపోతున్నానని లేఖలో ఆవేదన
ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడతాడనుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చదువుల ఒత్తిడిని తట్టుకోలేక 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. హెచ్‌బీ కాలనీలో నివసించే వసునూరి నాగమయ్య దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ (18) ఇంటర్ పూర్తి చేసి, హబ్సిగూడలోని ఓ ప్రముఖ కళాశాలలో ఐఐటీ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న సిద్ధార్థ తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రాత్రి సమయంలో సిద్ధార్థ స్నేహితుడు అఖిల్ అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానంతో సిద్ధార్థ తండ్రి నాగమయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాము బయట ఉన్నామని చెప్పిన నాగమయ్య.. ఇంటికి వెళ్లి చూడమని అఖిల్‌ను కోరారు. అఖిల్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూడగా, సిద్ధార్థ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని నాగమయ్య దంపతులకు తెలియజేశాడు.

వారు వెంటనే ఇంటికి చేరుకుని స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే సిద్ధార్థ మృతి చెందినట్లు గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. ఘటనాస్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభించింది. "చదువు ఒత్తిడి భరించలేకపోతున్నా. సరైన మార్కులు రావడం లేదు. తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చలేకపోతున్నా. జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నా" అని ఆ లేఖలో రాసి ఉంది. తండ్రి నాగమయ్య ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.


More Telugu News