మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. అగ్రనేత మల్లోజుల సంచలన వ్యాఖ్యలు
- సాయుధ పోరాటాన్ని ఆపేయాలన్న బసవరాజు నిర్ణయాన్ని అమలు చేస్తున్నామన్న వేణుగోపాల్
- మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారలేకపోవడం వల్లే నష్టం జరిగిందని విమర్శ
- మిగిలిన నేతలు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపు
- కిషన్‌జీ సోదరుడైన వేణుగోపాల్‌పై లొంగిపోయేనాటికి రూ. కోటి రివార్డు
సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ సిద్ధాంతకర్తగా పేరొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు సాయుధ పోరాటం ఒక విఫల ప్రయోగమని, ఆయుధాలు వీడటమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని గడ్చిరోలిలో లొంగిపోయిన ఆయన, ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాలు వెల్లడించారు.
గత మే నెలలో ఎన్‌కౌంటర్‌లో మరణించిన పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారని వేణుగోపాల్ తెలిపారు. ఆ నిర్ణయాన్ని అమలు చేసే ప్రక్రియలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని, ఆయనతో సైద్ధాంతికంగా ఏకీభవించిన తాము, ఆ బాధ్యతను పూర్తి చేసేందుకే సామూహికంగా లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తన కథనంలో పేర్కొంది.
గత అర్ధ శతాబ్దంలో పార్టీ చేసిన తప్పుల వల్లే ఉద్యమం ముందుకు సాగలేకపోయిందని వేణుగోపాల్ ఆత్మవిమర్శ చేసుకున్నారు. "1980ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాన్ని, ఆచరణను మార్చుకోవడంలో విఫలమయ్యాం. భారత ప్రభుత్వ శక్తిని తక్కువ అంచనా వేశాం. చట్టబద్ధమైన అవకాశాలను తిరస్కరించి ప్రజలకు దూరం అయ్యాం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల మాద్వీ హిడ్మా మరణం వంటి వరుస నష్టాలు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్న తిప్పిరి తిరుపతి (దేవూజీ) వంటి మిగిలిన నేతలు, కార్యకర్తలు చారిత్రక నిజాన్ని గ్రహించాలని కోరారు. తప్పుడు మార్గదర్శకాలను పక్కనపెట్టి, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు 50 ఏళ్ల అజ్ఞాత జీవితం ఒక స్వర్ణ అధ్యాయమని, అడవి బిడ్డలతో మమేకమై వారి హక్కుల కోసం పోరాడటం సంతృప్తినిచ్చిందని గుర్తుచేసుకున్నారు. తనను ద్రోహి అని పిలుస్తున్న వారి విమర్శలకు భయపడనని, మిగిలిన శక్తులను కాపాడి, మరో రూపంలో ఉద్యమాన్ని కొనసాగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మల్లోజుల వేణుగోపాల్, 2011లో మరణించిన మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీకి స్వయానా తమ్ముడు. లొంగిపోయే సమయానికి ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం.