రేవంత్ రెడ్డి భారీ భూకుంభకోణం.. మేం వచ్చాక భూములు వెనక్కి తీసుకుంటాం: కేటీఆర్

  • జీడిమెంట్ల పారిశ్రామికవాడలో పర్యటించిన కేటీఆర్ నేతృత్వంలోని నిజనిర్ధారణ బృందం
  • అనుముల రేవంత్ రెడ్డి కాదు.. అవినీతి కొండ అని విమర్శ
  • ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం తక్కువ ధరకు విక్రయించిన భూములను వెనక్కి తీసుకుంటామని, సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై ఆయన నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ బృందం జీడిమెట్ల పారిశ్రామిక పార్క్‌లో పర్యటించింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, అనుముల రేవంత్ రెడ్డి కాదని, ఆయన అవినీతి అనకొండ అని విమర్శించారు. కోట్లాది రూపాయల భూకుంభకోణంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల కోసం, పరిశ్రమల కోసం కేటాయించాల్సిన భూములను రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్మి లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఆ సొమ్మును ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఢిల్లీకి నిధులు తరలించే ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. గజం ధర రూ.లక్షన్నర పలుకుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.4,000కే అప్పగిస్తోందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఒకచోట, హిల్ట్ పాలసీ పేరుతో మరొకచోట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేదల గుడిసెలు కూల్చివేస్తున్నారని, కానీ పెద్దవాళ్లకు మాత్రం భూములు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News