విదేశీ పర్యటనల్లో పుతిన్ ఏం తింటారు?.. ఆసక్తికర విషయాలు!

  • భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
  • సొంత చెఫ్‌లు, ఆహారంతోనే విదేశీ పర్యటనలు
  • ప్రతి వంటకాన్ని పరీక్షించాకే తినే కఠిన నిబంధన
  • ఆడంబరాలకు దూరం.. ఇష్టంగా తినేది సింపుల్ ఫుడ్
  • పిస్తా ఐస్‌క్రీమ్ అంటే మాత్రం పుతిన్‌కు మక్కువ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం భారత్‌కు వ‌స్తున్నారు. 23వ వార్షిక భారత్-రష్యా సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు, చర్చలు జరగనున్నాయి. అందరి దృష్టి దౌత్యపరమైన అంశాలపై ఉండగా, తెరవెనుక మరో కీలక ఆపరేషన్ జరుగుతోంది. అదే.. పుతిన్ ఆహార భద్రత. ప్రపంచ నేతల్లో అత్యంత కట్టుదిట్టమైన ఆహార భద్రతా వ్యవస్థ కలిగిన వారిలో పుతిన్ ఒకరు.

సాధారణ ఆహారం.. అసాధారణ భద్రత!
విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు పుతిన్.. ఆతిథ్య దేశం లేదా హోటల్ సిబ్బంది వండిన ఆహారాన్ని దాదాపుగా ముట్టుకోరు. ఆయనతో పాటే రష్యా నుంచి ప్రత్యేక చెఫ్‌లు, సహాయక సిబ్బంది, కొన్నిసార్లు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కూడా వస్తుంది. వంటకు కావాల్సిన సరుకులను రష్యా నుంచే తెచ్చుకుంటారు లేదా స్థానికంగా కొన్నా వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వండిన ప్రతి వంటకాన్ని ఆయన తినడానికి ముందు ప్రత్యేక నిపుణులు రుచి చూసి, ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకుంటారు. అధికారిక విందుల్లో పాల్గొన్నా, ఆయన తినే ఆహారాన్ని మాత్రం సొంత బృందమే వేరుగా సిద్ధం చేస్తుంది.

ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, పుతిన్ తినే ఆహారం చాలా సాధారణంగా ఉంటుంది. ఆడంబరమైన వంటకాల కన్నా పోషకాలున్న సింపుల్ ఫుడ్‌నే ఆయన ఇష్టపడతారు. ఉదయం పూట తేనెతో రష్యన్ కాటేజ్ చీజ్ (త్వొరొగ్) లేదా గంజి, తాజా పండ్ల రసాలు తీసుకుంటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రెడ్ మీట్ కన్నా చేపలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గొర్రె మాంసం కూడా ఇష్టపడతారు. వీటితో పాటు టమాటాలు, కీర దోస వంటి వాటితో చేసిన సలాడ్లు తీసుకుంటారు.

చక్కెర ఎక్కువగా ఉండే డెజర్ట్‌లు, బేకరీ పదార్థాలకు ఆయన దూరంగా ఉంటారు. అయితే, పిస్తా ఐస్‌క్రీమ్ అంటే మాత్రం ఆయనకు చాలా ఇష్టమని చెబుతారు. పుతిన్ ఆహారపు అలవాట్లు, ఆయన రాజకీయ ఇమేజ్‌కు అద్దం పడతాయి. క్రమశిక్షణ, సంప్రదాయం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆయన వైఖరి, ఆయన తినే ఆహారంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.


More Telugu News