శరవణన్‌కు నివాళులర్పిస్తూ.. సూర్య కంటతడి

  • ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) కన్నుమూత
  • ఆయన భౌతికకాయం వద్ద కన్నీటిపర్యంతమైన నటుడు సూర్య
  • నివాళులర్పించిన సీఎం స్టాలిన్, రజనీకాంత్, శివకుమార్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత, సీనియర్ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శరవణన్ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వచ్చిన నటుడు సూర్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సూర్య నటించిన 'సుందరాంగుడు' (పెరళగన్), 'వీడొక్కడే' వంటి విజయవంతమైన చిత్రాలను ఏవీఎం సంస్థే నిర్మించింది. సూర్యతో పాటు ఆయన తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ కూడా శరవణన్‌కు నివాళులర్పించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శరవణన్‌కు అంజలి ఘటించారు. ఆయన మృతి పట్ల పవన్ కల్యాణ్, విశాల్ వంటి నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. శరవణన్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కల్యాణ్ ప్రార్థించారు. ఏవీఎం స్టూడియోస్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని విశాల్ గుర్తు చేసుకున్నారు.

ఏవీఎం శరవణన్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 300కు పైగా చిత్రాలను నిర్మించి నిర్మాతగా తనదైన ముద్ర వేశారు.


More Telugu News