వసీమ్ అక్రమ్ రికార్డును అధిగమించిన మిచెల్ స్టార్క్

  • అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా సరికొత్త చరిత్ర
  • యాషెస్ రెండో టెస్టులో హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసి 415వ వికెట్ తీసిన స్టార్క్
  • స్టార్క్‌ను అభినందిస్తూ పాక్ దిగ్గజం వసీం అక్రమ్ ట్వీట్
ఆస్ట్రేలియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట దశాబ్దాలుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టి, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతివాటం బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో బ్రిస్బేన్‌లో గురువారం ప్రారంభమైన యాషెస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో స్టార్క్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ (31)ను రెండో స్లిప్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి స్టార్క్ తన 415వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 414 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న వసీం అక్రమ్‌ను వెనక్కి నెట్టాడు. విశేషమేమిటంటే, స్టార్క్ తన 102వ టెస్టులోనే ఈ మైలురాయిని చేరుకోగా, అక్రమ్ 104 టెస్టుల్లో 414 వికెట్లు తీశాడు.

తన రికార్డును స్టార్క్ అధిగమించడంపై వసీం అక్రమ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. "సూపర్ స్టార్క్! నిన్ను చూసి గర్వపడుతున్నా. నీ కఠోర శ్రమకు ఇది ప్రతిఫలం. నా రికార్డును నువ్వు అధిగమించడం నాకు సంతోషంగా ఉంది. నీ కెరీర్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని అభినందించాడు.

ప్రస్తుతం ఆల్-టైమ్ వికెట్ టేకర్ల జాబితాలో 16వ స్థానంలో ఉన్న స్టార్క్, ఇదే మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ (417), షాన్ పొలాక్ (421) రికార్డులను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఈ పింక్ బాల్ టెస్టులో ఆరంభంలోనే స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. బెన్ డకెట్ (0), ఓల్లీ పోప్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. 


More Telugu News